సైజ్ ఎంతనేది మ్యాటర్ కాదు!

SMTV Desk 2019-10-31 16:03:52  

హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ పరిశోధకులు తొలిసారిగా ఇండియన్ బ్రెయిన్ అట్లాస్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. పశ్చిమ, తూర్పు దేశాల ప్రజలతో పోలిస్తే.. సగటు భారతీయుడి మెదడు పరిణామంలో చిన్నగా ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. మెదడు ఎత్తు, వెడల్పు.. ఇలా అన్ని విధాలుగా చిన్నగా ఉందట. దీని వల్ల అల్జీమర్స్ లాంటి మెదడు సంబంధ వ్యాధులను ముందుగానే గుర్తించే వీలుందని తెలిపారు. న్యూరాలజీ ఇండియా అనే జర్నల్‌లో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను ప్రచురించారు. చైనీస్, కొరియన్ల బ్రెయిన్ కంటే పొడవు, వెడల్పు, ఎత్తు, పరిమాణాల్లో భారతీయుల మెదడు చిన్నగా ఉందని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ పరిశోధకులు గుర్తించారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. తనదైన శైలిలో స్పందించారు. సైజ్ ఎంతనేది మ్యాటర్ కాదని ఆయన ట్వీట్ చేశారు. నెటిజన్లు కూడా ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు.