పాలసీదారులకు అలర్ట్... డిసెంబర్ 1 నుంచిమారుతున్న అంశాలు!

SMTV Desk 2019-11-26 12:06:04  

దేశీ దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఖాతాదారులకు అలర్ట్. కంపెనీ తన పాలసీలను సవరిస్తోంది. డిసెంబర్ 1 నుంచి పాలసీల్లో పలు మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. దీంతో మీరు తీసుకున్న పాలసీలో కూడా సవరణలకు అవకాశం ఉండొచ్చు. ఎల్ఐసీ తన పాలసీలను రీలాంచ్ చేయడంతో పాటు ప్రపోజల్ ఫామ్స్‌ను కూడా సవరించనుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ నిబంధనలకు అనుగుణంగా ఎల్ఐసీ తన పాలసీలను సవరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రపోజల్ ఫామ్స్‌తో పోలిస్తే.. కొత్త ఫామ్స్ సమగ్రంగా ఉంటాయి. ఉదాహరణకు ప్రపోజల్ ఫామ్ 300 అనేది ఒకటుంది. యుక్త వయసు వారు సెల్ఫ్ లైఫ్ ఇన్సూర్ కోసం ఈ ఫామ్‌ను ఉపయోగిస్తారు. ఇందులో ప్రస్తుతం 8 పేజీలు ఉంటాయి. ఏజెంట్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్, మోరల్ హజార్డ్ రిపోర్ట్, నెఫ్ట్ ఫామ్ వంటివి ఇందులో భాగమే. ఇప్పుడు కొత్త ఫామ్‌లో 11 పేజీలు ఉంటాయి. ఇక్కడ ఏజెంట్ రిపోర్ట్, నెఫ్ట్ ఫామ్ విడిగా ఉంటాయి. కొత్త ప్రపోజల్ ఫామ్స్‌ను నాలుగు సెక్షన్లుగా విభజిస్తారు. సెక్షన్ 1లో ప్రపోజర్ వివరాలు ఉంటాయి. సెక్షన్ 2లో ప్రపోజ్డ్ ప్లాన్ వివరాలు చూడొచ్చు. సెక్షన్ 3లో ప్రపోజల్ డీలైల్స్, ఫ్యామిలీ హెల్త్, అలవాట్లు వంటివి ఉంటాయి. సెక్షన్ 4లో ప్రపోజర్ సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది. సెక్షన్ 1లోని ప్రపోజర్ వివరాల్లో కేవైసీ నిబంధనలు, ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్లు, ట్యాక్స్ వివరాలు వంటివి ఉంటాయి. నామినీ ఐడీలు, పేరు, సంతకం, ఐడీ ప్రూఫ్ వంటివి సమాచారం కూడా చూడొచ్చు. సెక్షన్‌ 2లో ఇన్సూరెన్స్ ప్లాన్ వివరాలు ఉంటాయి. ఇంకా ఏమైనా రైడర్స్ ఉంటే వాటి సమచారం కూడా పొందుపరుస్తారు. జీవన్ అమర్ టర్మ్ ప్లాన్ ఎంచుకుంటే అప్పుడు స్మోకింగ్ అలవాటు కూడా తెలియజేయాల్సి ఉంటుంది. దీని ప్రాతిపదికన బీమా మొత్తం ఆప్షన్ మార్చుకోవచ్చు. సెక్షన్ 3లో వివిధ రకాల వ్యాధులపై డైరెక్ట్ ప్రశ్నలు ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రపోజల్ ఫామ్స్ మాదిరిగానే ఈ ప్రశ్నల సరళి ఉంటుంది. పాలసీదారుడికి ఉన్న వ్యాధుల గురించి కూడా తెలియజేయాల్సి ఉంటుంది. డయాబెటిక్, స్ట్రోక్, ఎయిడ్స్, హెచ్‌ఐవీ వంటి పలు వ్యాధుల వివరాలు అడుగుతారు. ఇకపోతే డిక్లరేషన్ పార్ట్ విషయానికి వస్తే.. ఇప్పుడు 3 సంతకాలు కాకుండా ఇప్పుడు ప్రపోజర్ 7 చోట్ల సంతకం చేయాల్సి ఉంటుంది. అలాగే ఎల్‌ఐసీ ఏజెంట్లు విడిగా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్‌ను కంపెనీకి అందించాల్సి ఉంటుంది. ఇకపోతే డిసెంబర్ 1 నుంచి కంపెనీ రీలాంచ్ చేసిన ప్లాన్లకు కొత్త ప్రపోజల్ ఫామ్స్‌ను స్వీకరిస్తుంది.