మార్‌క్రమ్‌ ఎంపిక సరైనది కాదు : గ్రేమ్‌ స్మిత్‌

SMTV Desk 2018-02-20 12:50:11  south africa, markram, grame smith, india, series

జొహానెస్‌బర్గ్, ఫిబ్రవరి 20‌: సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన కోహ్లి సేన అక్కడ పరిస్థితులకు ఆలవాటు చేసుకొని విజయాల పరంపర కొనసాగిస్తుంది. ఏ దేశమైన తమ సొంత గడ్డపై సిరీస్ ఓడిపోవడం భాదాకరమైన విషయం. కానీ దక్షిణాఫ్రికా లాంటి ఒక మేటి జట్టు కనీస పోటీ ఇవ్వకుండా ఓటమి పాలవ్వడం ఆ దేశ క్రీడాభిమానులు తట్టుకోలేకపోతున్నారు. టీమిండియా తో టెస్ట్ సిరీస్ ను 2-1 తో సొంతం చేసుకున్న దక్షిణాఫ్రికా, వన్డే సిరీస్ లో ఘోర పరాభవం మూటకట్టుకుంది. ఓ వైపు స్టార్ ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో జట్టు బలం సన్నగిల్లింది. సారథి డూప్లెసిస్‌ గాయపడటంతో ఆ స్థానంలో భారత్‌తో వన్డే సిరీస్‌కి మార్‌క్రమ్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఈ విషయంపై సౌతాఫ్రికా మాజీ ఆటగాడు గ్రేమ్‌ స్మిత్‌ మాట్లాడుతూ మర్క్రం ఎంపిక సరైంది కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. "డూప్లెసిస్‌ స్థానంలో మార్‌క్రమ్‌కు కెప్టెన్ బాధ్యతలు అందించడం సరైన నిర్ణయం అని నేను భావించట్లేదు. వన్డే సిరీస్‌ ఓటమితో ఇప్పుడు ఈ అంశంపైనే అందరూ మాట్లాడుకుంటున్నారు. తక్కువ వయస్సులో, కేవలం 10 వన్డేలు కూడా ఆడని ఆటగాడికి ఎలా నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారు. దీని వల్ల ఆటగాడు ఎంతో ఒత్తిడికి గురవుతాడు. ఒత్తిడి కారణంగానే అతడు పూర్తి ఆటపై దృష్టి నిలపలేడు. భాగస్వామ్యాలు ఏర్పరచడంలో మా జట్టు పూర్తిగా విఫలమవుతోంది" అని స్మిత్‌ వ్యాఖ్యానించాడు. మూడు టీ20ల సిరీస్‌లో తొలి టీ -20 ను గెలుచుకున్న భారత్ 1-0 తో ఆధిక్యంలో ఉంది. సిరీస్ లో ఇరుజట్ల భాగంగా రెండో మ్యాచ్ బుధవారం జరగనుంది.