భారత్ 493/6 డిక్లేర్డ్!

SMTV Desk 2019-11-16 14:08:17  

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌ని 493/6 వద్ద శనివారం డిక్లేర్ చేసింది. మ్యాచ్‌లో రెండో రోజైన శుక్రవారం 493/6తో ఆటని ముగించిన టీమిండియా.. ఈరోజు తొలి సెషన్‌లో ఒక బంతి కూడా ఆడకుండానే.. నిన్నటి స్కోరుతోనే భారత్ ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేస్తున్నట్లు శనివారం మ్యాచ్ ఆరంభానికి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించాడు. దీంతో.. ఈరోజు తొలి సెషన్‌లోనే బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌ని ఆరంభించింది. గురువారం మొదలైన ఈ టెస్టులో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (243: 330 బంతుల్లో 28x4, 8x6) డబుల్ సెంచరీతో చెలరేగగా.. వైస్ కెప్టెన్ అజింక్య రహానె (86: 172 బంతుల్లో 9x4), రవీంద్ర జడేజా (60 నాటౌట్: 76 బంతుల్లో 6x4, 2x6), చతేశ్వర్ పుజారా (54: 72 బంతుల్లో 9x4) అర్ధశతకాలతో సత్తాచాటారు. దీంతో.. 114 ఓవర్ల పాటు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన టీమిండియా 493/6తో తిరుగులేని స్థితిలో నిలిచింది. భారత ఫాస్ట్ బౌలర్ల దెబ్బకి తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైన బంగ్లాదేశ్ కనీసం రెండో ఇన్నింగ్స్‌లోనైనా పోటీనివ్వాలని ఆశిస్తోంది. కానీ.. 343 పరుగుల భారీ లోటుతో ఒత్తిడిలో ఈరోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న ఆ జట్టు.. మళ్లీ మ్యాచ్‌లోకి రావడం కత్తిమీద సామే. తొలి ఇన్నింగ్స్‌లో ముష్ఫికర్ రహీమ్ (43) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. దీనికి తోడు.. టెస్టు రికార్డ్‌ల్లోనూ ఇప్పటి వరకూ భారత్‌పై గెలిచిన చరిత్ర బంగ్లాదేశ్‌కి లేదు. ఈ నేపథ్యంలో.. భారత్ జట్టు విజయం దాదాపు ఖాయమవగా.. ఎంత తేడాతో అనేది తేలాల్సి ఉంది.