అందుకే ‘కెప్టెన్ కూల్’అని పిలుస్తారు!

SMTV Desk 2019-05-03 12:20:58  msd, mahendra singh dhoni, captain cool, csk, ipl 2019,

చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టన్ మహేంద్ర సింగ్ ధోనిపై టీమిండియా మాజీ మానసిక శిక్షకుడు ప్యాడీ అప్టన్‌ పలు ఆసక్తి విషయాలు వెల్లడించారు. ధోనికి మ్యాచ్‌లో ఎలాంటి ఎమోషన్స్ ఉండవని, ఏ రోజూ తన భావోద్వేగాల్ని మైదానంలో అతిగా ప్రదర్శించలేదని అందుకే అతని అభిమానులు ముద్దుగా ఇప్పటికీ ‘కెప్టెన్ కూల్’ అని పిలుస్తుంటారు. అని అన్నారు. 2008 నుంచి 2011 ప్రపంచకప్ వరకూ టీమిండియా ఆటగాళ్లతో కలిపి పనిచేసిన ప్యాడీ అప్టన్‌ తాజాగా ‘ది బేర్‌ ఫుట్‌ కోచ్‌’ పేరుతో తన అనుభవాల్ని పుస్తకం రూపంలో తీసుకొచ్చాడు. ఇందులో ధోనీ గురించే కాకుండా.. మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి కూడా ఆసక్తికరమైన విషయాల్ని ప్రస్తావించాడు. టీమ్‌తో ఉన్న సమయంలో గంభీర్ ఎక్కువ అభద్రతో ఉండేవాడని చెప్పుకొచ్చిన ప్యాడీ అప్టన్‌.. ప్రతికూల ఆలోచనలతో సతమతమయ్యేవాడని వెల్లడించాడు. మరోవైపు ధోనీతో పోలిస్తే.. భావోద్వేగాల విషయంలో విరాట్ కోహ్లీ పూర్తి భిన్నమని కూడా ప్యాడీ అప్టన్‌ అభిప్రాయపడ్డాడు. ‘మ్యాచ్ సమయంలో ధోనీ తన ఎమోషన్స్‌ని బాగా కంట్రోల్ చేసుకుంటాడని అంతా అనుకుంటున్నారు. కానీ.. వాస్తవంగా చెప్పాలంటే ధోనీకి అసలు ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. ఒక క్రికెటర్‌గానే కాకుండా.. వ్యక్తిత్వంలోనూ అతనంటే నాకు చాలా గౌరవం. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న ఒత్తిడికి తలొగ్గకుండా ప్రశాంతంగా ఆడగలిగే మానసిక సామర్థ్యం బహుశా ధోనీకి పుట్టకతోనే వచ్చి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఎమోషన్స్ లేకపోవడమే ధోనీకి వరమేమో..?’ అని ప్యాడీ అప్టన్‌ వెల్లడించాడు.