2018 ఇయర్ ఆఫ్ రిటైర్మెంట్స్

SMTV Desk 2018-10-25 18:45:56  RETAIRMENTS, ALASTAIR COOK,

హైదరాబాద్, అక్టోబర్ 25: ఈ ఏడాది క్రికెట్ అభిమానులకు కొంత నిరాశ కల్పిస్తుందనే చెప్పాలి. వొక్కొక్కరుగా క్రికెట్ కు వీడ్కోలు చెబుతుంటే అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.ఇప్పటికి ఈ ఏడాది మొత్తం ఐదుగురు వీడ్కోలు పలికారు. తాజాగా బ్రావో తన రిటైర్మెంట్‌ ని ప్రకటించాడు.
అయితే 2018 ఇయర్ ఆఫ్ రిటైర్మెంట్స్ గా చెప్పుకోవచ్చు అని అంటున్నారు.
వివరాల్లోకెల్తే...

1.'అలెస్టర్ కుక్'

టీమిండియాతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా సెప్టెంబర్ 7(శుక్రవారం)న భారత్‌తో జరిగిన చివరి టెస్టే అలెస్టర్ కుక్ కెరీర్‌లో చివరి మ్యాచ్‌. తన రిటైర్మెంట్‌పై కుక్ మాట్లాడుతూ "రిటైర్మెంట్ ప్రకటించడం బాధాకరమే అయినా నేను క్రికెట్ కోసం అన్నీ ఇచ్చానన్న సంతృప్తి నాకు ఉంది. నేను ఎప్పుడూ ఊహించని రికార్డులను సాధించాను. ఇంగ్లండ్ జట్టులో ఇంతకాలంగా నేను ఆడటం ఎంతో సంతోషంగా.. గౌరవంగా ఉంది. ఇక కొందరు జట్టు సభ్యులతో డ్రెస్సింగ్ రూంని పంచుకోలేను అని తెలిసి కాస్త బాధగా ఉంది. కానీ ఇందుకు ఇదే సరైన సమయం" అని కుక్ చెప్పాడు.
"నేను పిల్లాడిగా మా గార్డెన్‌లో క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి క్రికెట్ అంటే నాకు ప్రాణం. ఇంగ్లండ్ షర్ట్‌ని తీసేయం చాలా కష్టమే.. కానీ భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని, యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు దక్కాలనే ఇది చేస్తున్నాను. వాళ్లు మా దేశానికి ప్రతినిధ్యం వహించి మనల్ని మరింత అలరించాలని కోరుకుంటున్నా'' అని కుక్ తెలిపాడు.
ఇంగ్లాండ్ తరుపున 161 టెస్టులు ఆడిన అలెస్టర్ కుక్‌ 44.88 సటుతో 12,254 పరుగులు సాధించాడు. ఇందులో 32 సెంచరీలు, 56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2011లో బర్మింగ్‌హామ్‌లో భారత్‌పై 294 పరుగులు అతడి వ్యక్తిగత అత్యధిక పరుగులు కావడం విశేషం.

2.'మహమ్మద్ కైఫ్'

టీమిండియా తరుపున చివరిసారిగా 12 ఏళ్ల క్రితం మ్యాచ్ ఆడిన మొహమ్మద్ కైఫ్ శుక్రవారం (జులై 13)న క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల కైఫ్ తన రిటైర్మెంట్ సందర్భంగా "ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నాను" అని ఈ మెయిల్‌లో పేర్కొన్నాడు. "చరిత్రాత్మక నాట్‌వెస్ట్‌ ట్రోఫీలో నేను కూడా భాగమైనందుకు సంతోషిస్తున్నాను. అది జరిగి ఇప్పటికే 16సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో ఈ రోజు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నా" అని కైఫ్‌ పేర్కొన్నాడు. అదేవిధంగా భారత క్యాప్‌ ధరించే అవకాశం దక్కినందుకు గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు కైఫ్‌ చెప్పుకొచ్చాడు.
125 వన్డేలాడిన కైఫ్ 32 యావరేజితో 2753 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో కైప్ ఎక్కువగా 6 లేదా 7 స్థానాల్లో బరిలోకి దిగేవాడు. ఇక, టెస్టుల విషయానికి వస్తే 13 టెస్టులాడి 624 పరుగులు నమోదు చేశాడు. టెస్టుల్లో అత్యధిక స్కోరు 148 నాటౌట్.

3.'మోర్నీ మోర్కెల్'

దక్షిణాఫ్రికాకు చెందిన ఈ పేస్ బౌలర్ తన రిటైర్మెంట్‌పై మాట్లాడుతూ "'ఇది చాలా కఠినమైన నిర్ణయం. అదే సమయంలో ఇది వో సరికొత్త అధ్యాయం ప్రారంభించేందుకు సరైన సమయం. ఈ అంతర్జాతీయ షెడ్యూల్‌ల వల్ల నాపై చాలా వొత్తిడి పెరుగుతోంది. దీంతో నా కుటుంబంతో సమయం గడపలేకపోతున్నా. సఫారీ జెర్సీలో ఆడిన ప్రతి క్షణం నేను ఎంజాయ్ చేశా" అని అన్నాడు.
'క్రికెట్ దక్షిణాఫ్రికా, నా కుటుంబం, మిత్రులు ఇన్నాళ్లుగా నాకు చాలా మద్దతుగా నిలిచారు. నాలో ఇంకా చాలా క్రికెట్ మిగిలుందని భావిస్తున్నా. నా శక్తిని, ప్రతిభని రానున్న ఆస్ట్రేలియా సిరీస్‌లో ఉపయోగించి.. జట్టు విజయాన్ని కట్టబెట్టాలని నేను అనుకుంటున్నా' అని మోర్కెల్ తెలిపాడు.
33 ఏళ్ల మోర్కెల్ దక్షిణాఫ్రికా తరుపున ఇప్పటివరకు 83 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ20 మ్యాచ్‌లాడాడు. మోర్కెల్ 2006లో జరిగిన బాక్సింగ్‌ డే టెస్ట్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాడు. 83 టెస్టులాడిన మోర్నీ మోర్కెల్ 28.08 యావరేజితో 294 వికెట్లు తీసుకున్నాడు.

4.'ఏబీ డివిలియర్స్'

34 ఏళ్ల ఏబీ డివిలియర్స్ మూడు ఫార్మాట్ల నుంచి తాను వైదొలగుతున్నట్లు తన ట్విట్టర్‌లో వో వీడియో సందేశాన్ని పోస్టు చేశాడు. ఈ వీడియోలో డివిలియర్స్ 'తక్షణమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నా. 114 టెస్టు మ్యాచ్‌లు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాను. ఇతరులకు అవకాశం ఇచ్చే సమయం ఇది. ప్రస్తుతం నా వంతు వచ్చింది. నేను అలసిపోయానని నిజాయతీగా చెబుతున్నాను. నేను రిటైర్ అవుతున్నా' అని తెలిపాడు.
'ఇది చాలా కఠిన నిర్ణయం కానీ చాలా కాలంగా ఈ విషయంపై ఆలోచిస్తున్నాను.. కానీ నేను తప్పుకోవడానికి ఇదే సరైన సమయం. క్రికెట్ దక్షిణాకాకి, నా జట్టు సభ్యులకు, దక్షిణాఫ్రికా, ప్రపంప వ్యాప్తంగా నా వెనుక ఉండి నాకు మద్దతు తెలిపిన అభిమానులకు నా ధన్యవాదాలు' అని డివిలియర్స్ తెలిపాడు.
'ఇండియా, ఆస్ట్రేలియాలపై సిరీస్‌లు గెలిచిన తర్వాత రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని భావించాను. ఇక నా సహచక క్రికెటర్లకు ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ల మద్దతు లేకుండా నేను ఈ స్థాయికి వచ్చేవాడినే కాదు. ఇక నావల్ల కాదు అనిపించింది. నా నిర్ణయాన్ని అర్థం చేసుకునే అభిమానులకు కృతజ్ఞతలు. విదేశాల్లో ఆడే ఆలోచన కూడా నాకు లేదు. అయితే దేశీయంగా టైటాన్స్ టీమ్‌కు మాత్రం ఆడతాను' అని డివిలియర్స్ తెలిపాడు.
2004 డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాడు. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు, 141 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన డివిలియర్స్ మొత్తం 50 సెంచరీలు, 137 హాఫ్ సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు సాధించాడు.

5.'డ్వేన్ బ్రావో'

వెస్టిండిస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం ప్రకటించాడు. 35 ఏళ్ల బ్రావో 2016 సెప్టెంబర్లో చివరిసారిగా విండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాదు 2012, 2016 టీ20 వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన బ్రావో.. వెస్టిండిస్ జట్టు తరుపున 270 మ్యాచ్‌ల్లో బరిలో దిగాడు. తన రిటైర్మెంట్ సందర్భంగా బ్రావో మీడియాతో మాట్లాడుతూ "14 ఏళ్ల క్రితం వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేశాను. నాకు ఇప్పటికీ ఆ క్షణాలు గుర్తున్నాయి. 2004లో ఇంగ్లాండ్‌పై తొలి మ్యాచ్ ఆడటానికి లార్డ్స్‌లోకి అడుగుపెట్టే ముందు మెరూన్ క్యాప్ అందుకున్నాను. సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడాను. తర్వాతి తరం క్రికెటర్లకు అవకాశం ఇవ్వడం కోసం రిటైర్ అవుతున్నా" అని బ్రావో అన్నాడు.
వెస్టిండిస్ తరుపున 40 టెస్టులు ఆడిన బ్రావో 31.43 యావరేజితో 2200 పరుగులు చేయడంతోపాటు 86 వికెట్లు తీశాడు. ఇక, 164 వన్డేలాడిన బ్రావో 2968 పరుగులు చేయడంతోపాటు 199 వికెట్లు పడగొట్టాడు. 66 టీ20ల్లో 1142 పరుగులు చేసి, 52 వికెట్లు తీశాడు.