ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు...

SMTV Desk 2019-01-10 16:25:00  Telangana panchayat elections, Election commission, Sarpanch, Ward members

హైదరాబాద్, జనవరి 10: రాష్ట్ర పంచాయతి ఎన్నికల్లో ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ పలు అంశాలను వెల్లడించారు. గ్రామ పంచాయతిలో సర్పంచితో పాటు వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైన చోట అదే రోజు ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం అభ్యర్థుల తుది జాబితా వెల్లడిస్తారు. వొక పదవికి కేవలం వొకరు మాత్రమే పోటీలో ఉంటే ఎన్నిక ఏకగ్రీమైనట్లు ప్రకటిస్తారు. సర్పంచి పదవితోపాటు వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికైతే వెంటనే ఉప సర్పంచి ఎన్నిక చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.

ఈ మేరకు ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఏకగ్రీవ ఎన్నికను ప్రకటించిన వెంటనే స్టేజ్‌-1 రిటర్నింగ్‌ అధికారి ఉపసర్పంచి ఎన్నిక చేపట్టాలని సూచించింది. వొకవేళ స్టేజ్‌-1 రిటర్నింగ్‌ అధికారి క్లస్టర్‌ పరిధిలో వొకటి కంటే ఎక్కువ పంచాయతీల్లో ఎన్నికలు ఏకగ్రీవమైతే మిగతా చోట్ల స్టేజ్‌-2 రిటర్నింగ్‌ అధికారులు ఉప సర్పంచి ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. వొకవేళ ఏకగ్రీవం కాకుండా సదరు పంచాయతీల్లో వొకటి లేదా రెండు పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉంటే పోలింగ్‌, ఓట్ల లెక్కింపు అనంతరమే ఉపసర్పంచి ఎన్నిక జరపాలని ఎస్‌ఈసీ సూచించింది.