మూడు అండమాన్ దీవుల పేర్లు మార్చనున్న కేంద్రం !!!

SMTV Desk 2018-12-25 17:34:53  Andaman Nicobar islands, Rename, Narendra Modi, subhash chandrabose

న్యూదిల్లీ, డిసెంబర్ 25: కేంద్ర ప్రభుత్వం అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మూడు దీవుల పేర్లను మార్చనుంది. డిసెంబర్ 30న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అండమాన్‌ నికోబార్‌ రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌ పర్యటన సందర్భంగా మూడు దీవుల కొత్త పేర్లను ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ మూడు దీవులను హావ్‌లాక్‌ ఐలాండ్‌, నీల్ ఐలాండ్‌, రాస్‌ ఐలాండ్‌ అనే పేర్లతో పిలుస్తుండగా.. హావ్ లాక్ దీవిని స్వరాజ్ ద్వీప్ గా, నీల్ ఐలాండ్ ను షహీద్ ద్వీప్ గా, రాస్ ఐలాండ్ ను నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవిగా మార్చనున్నారు. ఈ మేరకు పేరు మార్పులకు ఇప్పటికే కసరత్తు పూర్తయినట్లు హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది.1943లో సుభాశ్‌ చంద్రబోస్‌ స్థాపించిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దీన్ని ఏర్పాటు చేశారు.

1943 డిసెంబర్ 30న పోర్ట్ బ్లెయిర్ లోని జింఖానా గ్రౌండ్ లో నేతాజీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అండామాన్ దీవులు బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొందిన తొలి భారత భూభాగం అని ఆ రోజు నేతాజీ ప్రకటించారు. అప్పుడు అండమాన్ దీవికి షహీద్ అని, నికోబార్ దీవికి స్వరాజ్ అని సుభాష్ చంద్రబోస్ పేర్లను మార్చారు

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ప్రముఖ పర్యటక ప్రాంతమైన హావ్‌లాక్‌ దీవి పేరు మార్చాలని గతేడాది మార్చిలో భాజపా సభ్యుడు ఎల్‌ఏ గణేశన్‌ రాజ్యసభలో డిమాండ్‌ చేశారు. దీవుల సముదాయంలోకెల్లా అతి పెద్ద దీవి అయిన హావ్‌లాక్‌ దీవి పేరును బ్రిటీశ్‌ అధికారి సర్‌ హెన్రీ హావ్‌లాక్‌ స్మారకంగా పెట్టారు.