కోదండరామ్‌ పై అగ్రహం వ్యక్తం చేసిన తెరాస మంత్రి

SMTV Desk 2018-11-13 12:52:36  Harish rao. Prof. Kodandaram, Congress party, TDP, TRS

హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు టిజేఎస్ అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్‌ పై సంచలన వ్యాఖ్యానాలు చేశారు.





“మూడు రోజుల క్రితం నేను చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాజెక్టులను ఏవిధంగా అడ్డుకొంటున్నారో, తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఏవిధంగా కుట్రలు పన్నుతున్నారో ప్రజలకు అర్దమయ్యేలా వివరించేసరికి చంద్రబాబుకి వణుకు పుట్టింది. దాంతో అమరావతిని కాంగ్రెస్ పార్టీకి కొత్త స్క్రిప్ట్ వచ్చింది.

చంద్రబాబును ముందుంచుకొని ఎన్నికలకు వెళితే మహాకూటమి నష్టపోతుందని కనుక బాబుకు బదులు కోదండరామ్‌ను ముందుంచుకోవాలని దాని సారాంశం. అమరావతి నుంచి ఆ స్క్రిప్ట్ రాగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి హడావుడిగా తెలంగాణ జనసమితి కార్యాలయానికి వెళ్ళడం, కోదండరామ్‌ను మనిఫెస్టో అమలు కమిటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తారని ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. కోదండరామ్‌ తమకు 10-15 సీట్లు కావాలని రెండు నెలల నుంచి కాంగ్రెస్ పార్టీని బ్రతిమాలుకొంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ 3-4 సీట్లు మాత్రమే విదిలిస్తోంది. ఆ నాలుగు సీట్ల కోసమే ఆయన గత ఎన్నికలలో కూడా డిల్లీ వెళ్ళి కాంగ్రెస్‌ అధిష్టానం ముందు చేతులు కట్టుకొని నిలబడ్డారు. అప్పుడు రహస్యంగా ఆ పని చేస్తే ఇప్పుడు ఆ నాలుగు సీట్ల కోసం బహిరంగంగానే కాంగ్రెస్‌ తో చేతులు కలపడానికి సిద్దపడుతున్నారు. వొకప్పుడు ఏ కాంగ్రెస్ నేతలు ఆయనను తిట్టారో ఇప్పుడు వారి పంచనే చేరుతున్నారు. వొకప్పుడు ఆయన ఏ చంద్రబాబునాయుడుని వేలెత్తి చూపారో ఇప్పుడు ఆయన నేతృత్వంలోనే పనిచేయడానికి సిద్దపడ్డారు. ఇదంతా దేనికంటే కేవలం 3-4 సీట్ల కోసం. కానీ కాంగ్రెస్ పార్టీ అవి కూడా విదిలించడం లేదు. మరి కోదండరామ్‌ దేనికోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలనుకొంటున్నారు? ఆయన లక్ష్యం ఏమిటి? మహాకూటమి లక్ష్యం ఏమిటి?చెప్పాలి,” అని మంత్రి హరీష్ రావు అన్నారు.