వాజ్‌పేయి చితాభస్మ నిమజ్జనం

SMTV Desk 2018-08-23 17:02:59  Vajpayee, BJP, former Prime minister,

మాజీ ప్రధాని వాజ్‌పేయి చితాభస్మం, అస్థికలను తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు గోదావరి, మూసీ, కృష్ణా నదుల్లో నిమజ్జనం చేశారు. పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, ప్రేమేందర్‌ రెడ్డి తదితరులతో కూడిన బృందం గురువారం (ఆగస్టు 23) ఉదయం బాసరలో వాజ్‌పేయి చితాభస్మాన్ని గోదావరి నదిలో కలిపారు. మేడ్చల్, రామాయంపేట, కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా వీరు బాసర చేరుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, శాసనసభా పక్షనేత కిషన్‌రెడ్డి నేతృత్వంలోని మరో బృందం చేవెళ్ల, వికారాబాద్ మీదుగా అనంతగిరి చేరుకొని అక్కడ మూసీ సంగమంలో అటల్ అస్థికలను కలిపారు. అటు.. ఏపీ బీజేపీ నేతలు దివంగత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ అస్థికలను కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం వాజ్‌పేయి అస్థికలను భవానీపురం పున్నమి ఘాట్‌ వద్ద కృష్ణా నదిలో కలిపారు. గంగా నది సహా.. మొత్తం 11 రాష్ట్రాల్లోని వంద నదుల్లో వాజ్ పేయి చితాభస్మం కలుపుతారు. మధ్యప్రదేశ్ లోని నర్మద, చంబల్, పార్వతి, క్షిప్రా, తపతి, రెవా, బెట్వా, పెంచ్, సింధ్, కేన్ నదుల్లో కలిపేందుకు షెడ్యూల్ సిద్ధం చేశారు. తెలంగాణలోని కృష్ణా , తుంగభద్ర, గోదావరి, మూసీ నదుల్లో నాలుగుచోట్ల వాజ్‌పేయి చితాభస్మాన్ని కలపనున్నారు.