మానస సరోవర యాత్ర : యాత్రికుల కోసం హెల్ప్ లైన్లు..

SMTV Desk 2018-07-03 12:49:37   Mansarovar Pilgrims, mansarovar yatra, india-nepal border, sushma swaraj

ఢిల్లీ, జూలై 3 : తీవ్రమైన మంచు వర్షం ప్రభావంతో వాతావరణం అనుకూలించకపోవడంతో మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన వేలాది మంది యాత్రికులు నేపాల్‌-చైనా సరిహద్దుల్లో చిక్కుకుపోయారు. వీరిలో తెలుగు రాష్ట్రాల వారితో పాటు కర్ణాటక, తమిళనాడు, ఇతర ప్రాంతాలకు చెందిన వారున్నారు. సిమికోట్‌లో 525 మంది, హిల్సాలో 550మంది, టిబెట్‌ వైపు మరో 500 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ స్పందించారు. యాత్రికులకు అందించే సహాయక చర్యలను ఆమె పర్యవేక్షిస్తున్నారు. కాఠ్‌మాండూలోని భారత ఎంబసీ అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. మానస సరోవర్‌ యాత్రలో చిక్కకుపోయిన భారత యాత్రికులను కాపాడేందుకు నేపాల్‌ ప్రభుత్వాన్ని ఆర్మీ హెలికాప్టర్లు ఇవ్వాలని కోరామని విదేశాంగ మంత్రి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. సిమ్‌కోట్‌, నేపాల్‌గంజ్‌ ప్రాంతాలకు నేపాల్‌లోని భారత ఎంబసీ కార్యాలయం తమ ప్రతినిధులను పంపిందని తెలిపారు. వారు ప్రయాణికులతో సంప్రదింపులు జరుపుతున్నారని.. అందరికీ ఆహారం, ఇతర వసతి సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. తెలుగు, తమిళం కన్నడ, మలయాళ భాషల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌ లైన్‌ నంబర్లను ఆమె ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన యాత్రికుల సమాచారం అందించేందుకు కొన్ని హెల్ప్ లైన్ నెంబర్లు.. >> పిండి నరేష్‌ +977 9808082292(తెలుగు), >> ఆర్‌ మురుగన్‌ +977 98085006(తమిళం), >> యోగేంద్ర +977 9823672371(కన్నడ), >> రంజిత్‌ +977 9808500644(మలయాళం). >> ప్రణవ్‌ గణేశ్‌ +977 -9851107006(ఫస్ట్‌ సెక్రటరీ).