వైరల్ : సర్జికల్‌ స్ట్రైక్స్‌ ..

SMTV Desk 2018-06-28 12:08:51  surgical strikes, surgical strikes in kashmir, surgical strikes, indian army

ఢిల్లీ, జూన్ 28 : రెండు సంవత్సరాల క్రిందట భారత సైన్యం జమ్ముకశ్మీర్‌ సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలో ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఉడీ ఘటనకు ప్రతీకారంగా పాక్‌ అక్రమిత కశ్మీర్‌లోని(పీఓకే) ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 2016 సెప్టెంబర్‌లో భారత ఆర్మీ ఈ దాడులకు దిగింది. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి పలువురు ముష్కరులను మన సైన్యం మట్టుబెట్టింది. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు సైన్యం సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసిన వీడియోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి పలు టీవీ ఛానళ్లు ఆ వీడియోలను ప్రసారం చేస్తున్నాయి. అయితే ఆ వీడియోలు అధికారిక వర్గాల నుంచే అందినట్లు తెలుస్తోంది. వీడియో ఫుటేజీలో డ్రోన్లు, మానవరహిత ఏరియల్‌ వెహికిల్స్‌(యూఏవీ)తో సైన్యం మెరుపు దాడులు చేసినట్లు కనిపిస్తోంది. బంకర్లు, పలు మిలటరీ కట్టడాలు ధ్వంసమైతున్నట్లు, పలువురు మరణిస్తున్నట్లు వీడియోల్లో ఉంది. ఇది నిజమైనదేనని సర్జికల్‌ స్ట్రైక్స్‌కు ఇంచార్జ్‌గా ఉన్న రిటైర్డ్‌ లెఫ్టినెంగ్‌ జనరల్‌ డీఎస్‌ హూడా తెలిపారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగిన తర్వాత అవి ఎలా జరిగాయో తెలుసుకోవడానికి సైనికులు చిత్రీకరించిన దృశ్యాలను తను చూశానని అన్నారు. ఈ వీడియో బయటకు రావడం మంచిదేనని అభిప్రాయపడ్డారు. అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌, ఆర్మీ చీఫ్‌ దల్బీర్ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌లు దిల్లీ నుంచి వీడియోలు చూస్తూ మెరుపుదాడుల ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. అయితే ఆ వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి.