ఢిల్లీ, జూన్ 8 : ఆధార్ కార్డులో దొర్లిన పొరపాట్లను మార్పులు.. చేర్పులు చేసే చరిత్రను ఇక నుండి ఆన్‌లైన్ నుండి పొందవచ్చు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఈ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి ఆధార్ వినియోగదారులు... తమ వివరాలను తాజా పర్చుకుంటే ఆ చరిత్రను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ వెసులుబాటు కారణంగా చిరునామా మార్పు వంటి వివరాలను అవసరమయితే రుజువుగా సమర్పించుకోవచ్చు. పేరు, పుట్టినతేదీ.. ఇలా ఏ మార్పు చేసుకున్నా ఆ చరిత్రను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ దరఖాస్తు చేసినప్పటి నుంచి చిరునామా, ఇతర వివరాలలో ఏ రోజున ఏయే మార్పులు చేసిందీ తేదీలతో సహా చరిత్రలో కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ సౌకర్యానికి సంబంధించి బీటా వర్షన్‌ను ప్రారంభించినట్లు యూఐడీఏఐ సీఈవో డాక్టర్ అజయ్ భూషణ్ తెలిపారు.