ఐపీఎల్ కు తాకిన టాంపరింగ్ సెగ..

SMTV Desk 2018-03-26 14:08:29  ipl, steve smith, david warner, rajasthan royals

న్యూఢిల్లీ, మార్చి 26 : ఆస్ట్రేలియా ఆటగాళ్లు విజయం కోసం దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో చేసిన బాల్ టాంపరింగ్ వివాదం ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ చరిత్ర ను కుదిపేస్తుంది. ప్రస్తుతం ఈ సెగ భారత్ లో ఏప్రిల్ 7 న ఆరంభమై ఐపీఎల్ సీజన్ ను తాకింది. ఈ ఘటనతో అడ్డంగా దొరికిపోయిన ఆస్ర్టేలియా సారథి స్మిత్‌, ఉప సారథి వార్నర్‌ త్వరలో జరిగే ఐపీఎల్-11 సీజన్ కు ఆడేది అనుమానంగా మారింది. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు స్మిత్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు వార్నర్‌ నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఐసీసీ, క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) బాధ్యులపై చర్యలకు ఉపక్రమించాయి. తాజాగా ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా ఈ విషయంపై మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. " స్మిత్‌, వార్నర్‌లు సదరు జట్లకు కీలక ఆటగాళ్లు. అందులోనూ కెప్టెన్లు. ఇప్పటికిప్పుడే వారిపై ఏ నిర్ణయమూ తీసుకోలేం. ఈ అంశంలో బీసీసీఐతో పాటు రాజస్థాన్‌, సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీలు వేచిచూడాలనుకుంటున్నాయి. రెండు లేదా మూడు రోజులు ఆగి తుది నిర్ణయాన్ని వెల్లడిస్తా౦" అని శుక్లా తెలిపారు.