నరకాసురుని వధ జరిగిన ప్రదేశం..

SMTV Desk 2017-10-18 13:11:21   Narakasurudu, God Srikrishna, Godess Sathyabhama, diwali festival.

కృష్ణా, అక్టోబర్ 18 : భారతదేశ౦లో దీపావళి పండుగను చిన్న, పెద్ద అందరూ కలిసి ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు, సత్యభామ నరకాసురుడిని చంపిన సందర్భంలో ఈ పండుగను జరుపుకుంటారు. ద్వాపరయుగంలో నరకాసురుడనే రాక్షసుడు ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవాడు. అప్పుడు ప్రజలందరూ శ్రీకృష్ణుణ్ణి ప్రార్దించేవారు. ప్రజల మొర ఆలకించిన శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై వచ్చి నరకాసురుడిని వధించారు. నరకాసురుడు చనిపోయిన రోజు ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి కావడం వల్ల ఆ రోజును నరక చతుర్దశి అని కూడా అంటారు. ఆరోజు ప్రజలందరూ ఆనందంతో బాణసంచాలు కాల్చారు. ఆ విధంగా దీపావళి పర్వదినం వచ్చింది. నరకాసుర వధ జరిగిన సందర్భంగా దీపావళి చేసుకుంటున్నాం కాని నరకాసురుని వధ ఎక్కడ జరిగింది అనేది మాత్రం చాలా మందికి ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ నరకాసుర వధ కృష్ణా జిల్లాలోని నడకుదురు ప్రా౦తంలో జరిగిందని స్కంధ పురాణం చెబుతో౦ది. నడకుదురు గ్రామం ఆ రోజుల్లో నరకోత్తరక క్షేత్రంగా పేరుగా౦చిన నది తీర గ్రామం. నరకాసుర వధ అనంతరం శ్రీకృష్ణుడు, సత్యభామ అక్కడ వెలసిన లక్ష్మీనారాయణులను పాటలీ పుష్పాలతో పూజించారు. తరువాత దేవ వనం నుంచి పాటలీ వృక్షాలను తెచ్చి ఈ గ్రామంలో నటాడని పురాణ కథనం. శ్రీకృష్ణుడు పూజించినట్టు చెప్పే లక్ష్మీనారాయణుల గుడి ఈ గ్రామంలో కార్తీక వనంలో ఉంది. ద్వాపర యుగం నాటికే పరమశివుడు ఈ గ్రామంలో పృథ్వీశ్వరుడిగా వెలిసాడు. నరకాసురుడు ఓ బ్రాహ్మణుని చంపడం వల్ల పాప పరిహారార్థం శ్రీకృష్ణుడు, పృథ్వీశ్వరుడికి పూజలు చేశాడట. మన దేశంలో పాటలీ వృక్షాలు కాశీ, నడకుదురులో మాత్రమే ఉన్నాయి. ఈ వృక్షాలు వేరే చోట నాటిన పెరిగిన దాఖలాలు లేవు. ప్రస్తుతం కాశీలో కూడా ఈ వృక్షాలు అంతరించి పోతున్నాయి. కాని నడకుదురులో మాత్రం కార్తీక వనంలో అవి పెరుగుతూనే ఉన్నాయి. కార్తీక మాసం శివునికి ఎంతో ప్రీతికరం కాబట్టి స్థానికులు ఈ మాసంలో పూసే పాటలీ పుష్పాలతోనే శివునికి పూజలు చేస్తారు.