బ్యాంక్ కస్టమర్లకు మోదీ శుభవార్త!

SMTV Desk 2019-11-11 13:28:36  

కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త అందివ్వనుంది.ఈ మేరకు అన్ని ఫైనాన్షియల్ ఇన్‌స్టిటయూషన్లను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పరిధిలోకి తీసుకురావాలని భావిస్తోంది. దీంతోపాటు బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ మొత్తాన్ని కూడా పెంచాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి పలు నివేదికలు వెలువడుతున్నాయి. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పంజాబ్ అండ్ మహరాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ (PMC) ఉదంతం నేపథ్యంలో కేందం ఈ దిశగా అడుగులు వేయనుందని తెలుస్తోంది. మొండి బకాయిలకు సంబంధించి నిబంధనలను అతిక్రమించడంతో ఆర్‌బీఐ ఈ బ్యాంక్‌పై నియంత్రణలు విధించిన విషయం తెలిసిందే. ‘డిపాజిట్ ఇన్సూరెన్స్ అంశంపై రివ్యూ జరిగింది. ఇన్సూరెన్స్ కవరేజ్‌ను రూ.లక్ష నుంచి ఆమోదయోగయమైన స్థాయికి పెంచాలనే ప్రతిపాదన ఉంది’ అని అడ్మినిస్ట్రేషన్‌లోని అధికారి ఒకరు తెలిపారు. 1993 నుంచి డిపాజిట్లకు రూ.లక్ష ఇన్సూరెన్స్ కవరేజ్ కొనసాగుతూ వస్తోంది. అంతకుముందు ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ రూ.30,000గా ఉంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) బ్యాంక్ డిపాజిట్లకు రూ.లక్ష వరకు ఇన్సూరెన్స్ కవర్ అందిస్తోంది. అయితే సదురు బ్యాంక్ డీఐసీజీసీ పరిధిలో ఉంటేనే ఈ ప్రయోజనం లభిస్తుంది. డీఐసీజీసీ బ్యాంక్ సేవింగ్స్, ఫిక్స్‌డ్, కరెంట్, రికరింగ్ అకౌంట్లకు కవరేజ్ అందిస్తుంది. ప్రస్తుతం డీఐసీజీసీ రూ.100 డిపాజిట్‌కు 10 పైసల ప్రీమియం వసూలు చేస్తోంది. అన్ని బ్యాంకులకు ఇదే వర్తిస్తుంది. 2005 ఏప్రిల్ నుంచి ఈ ప్రీమియం అమలులోకి వచ్చింది. గతంలో ప్రీమియం 8 పైసలుగా ఉండేది. డీఐసీజీసీ ప్రకారం.. 2019 మార్చి 31 నాటికి 217.4 కోట్ల అకౌంట్లలో 200 కోట్ల అకౌంట్లకు కవరేజ్ ఉంది. అయితే డీఐసీజీసీ, ఆర్‌బీఐ, ఆర్థిక శాఖ ఈ అంశంపై ఇప్పటిదాకా స్పందించలేదు.