A30s, A50s ఫోన్ ల ధరలు తగ్గింపు!

SMTV Desk 2019-11-09 16:38:20  

స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్.. గెలాక్సీ ఏ30ఎస్, ఏ50ఎస్ ల ధరలను రూ.1,000 మేర తగ్గించింది. ఈ రెండు ఫోన్లను సెప్టెంబర్ లోనే శాంసంగ్ లాంచ్ చేసింది. అంటే కేవలం రెండు నెలల్లోనే వీటిపై ధర తగ్గింపును శాంసంగ్ అందించిందన్న మాట. అయితే ఈ ధర తగ్గింపు కేవలం శాంసంగ్ అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే కనిపించింది. మిగిలిన ఈ-కామర్స్ వెబ్ సైట్లలో దీని ధర ఇంకా మారలేదు. కాబట్టి మీరు ఈ ఫోన్లను కొనాలనుకుంటే అధికారిక వెబ్ సైట్ లో కొనుగోలు చేయడం మంచిది. శాంసంగ్ గెలాక్సీ ఏ50ఎస్ మోడల్ అసలు ధరను చూస్తే 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999గానూ, 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధరను రూ.24,999గానూ నిర్ణయించారు. అయితే ఈ ఫోన్ పై ఇప్పటికే రూ.2,000 ధర తగ్గింపును శాంసంగ్ అందించింది. ఈ రూ.1,000 తగ్గింపును కూడా కలిపితే ప్రస్తుతం 4 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర రూ.19,999కు, 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర రూ.21,999కు పడిపోయింది. అంటే ఒక్కో మోడల్ పై రూ.3,000 తగ్గిందన్న మాట. శాంసంగ్ గెలాక్సీ ఏ30ఎస్ విషయానికి వస్తే.. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను ప్రారంభంలో రూ.16,999గా నిర్ణయించారు. ఇప్పుడు దీని ధర రూ.15,999గా ఉంది. అంటే దీనిపై రూ.1,000 తగ్గింపు అందించారు. శాంసంగ్ గెలాక్సీ ఏ50ఎస్ లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఇన్ ఫినిటీ-యూ సూపర్ అమోలెడ్ (AMOLED) డిస్ ప్లేను అందించారు. ఆక్టాకోర్ ఎక్సోనిస్ 9611 ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్లు తీయడానికి 8 మెగాపిక్సెల్ కెమెరాను, డెప్త్ సెన్సార్ గా 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాను అమర్చారు. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 32 మెగా పిక్సెల్ గా ఉంది. నైట్ మోడ్ ఫీచర్ ను అందుకున్న మొదటి గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్ ఇదే. ఇందులో 4000 mAh బ్యాటరీని అమర్చారు. 15W ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. వైఫై, బ్లూటూత్, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఎన్ఎఫ్ సీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిప్ ఆపరేటింగ్ సిస్టం మీద పనిచేస్తుంది. ఇందులో డ్యూయల్ సిమ్ సౌకర్యం ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఏ30ఎస్ లో 6.4 అంగుళాల హెచ్ డీ+ ఇన్ ఫినిటీ-యూ సూపర్ అమోలెడ్ (AMOLED) డిస్ ప్లేను అమర్చారు. ఆక్టాకోర్ ఎక్సోనిస్ 7904 ప్రాసెసర్ ను ఇందులో అందించారు. ఇందులో కూడా వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన కెమెరా సామర్థ్యం 25 మెగా పిక్సెల్ కాగా, అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్లు తీయడానికి 8 మెగాపిక్సెల్ కెమెరాను, డెప్త్ సెన్సార్ గా 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాను అమర్చారు. సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాను ముందువైపు అందించారు. ఇందులో కూడా ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేసే 4000 ఎంఏహెచ్ బ్యాటరీనే ఉంది. వైఫై. బ్లూటూత్, ఎన్ఎఫ్ సీ, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఇందులోనూ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. ఇందులో కూడా డ్యూయల్ సిమ్ సౌకర్యం ఉంది.