ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వంకాయ, పీచ్ పండు బ్యాన్

SMTV Desk 2019-10-31 15:54:23  

ఇకపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వంకాయ , పీచ్ పండ్ల ఎమోజీలు ఉపయోగించరాదు. కొత్తగా ప్రవేశపెట్టిన కమ్యునిటీ గైడ్‌లైన్స్‌లో ఈ నిబంధన పెట్టారు. ఇటీవల కొందరు వంకాయ, పీచ్ పండ్లను బూతు పదాల్లో పెట్టి విచ్చలవిడిగా వాడేస్తున్నారు. రహస్యాంగాలను పోలి ఉండే వీటితో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు వంకాయ, పీచ్ కాయలను ‘సెక్సువల్ ఎమోజీ’లుగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సోషల్ మీడియా వేదికలు.. నగ్నత్వం లేదా సెక్స్ సంబంధిత చిత్రాలను పోస్టు చేయడాన్ని ఎప్పుడో నిషేదించాయి. నిబంధనలు అతిక్రమించేవారికి తొలుత హెచ్చరికలు కూడా చేస్తున్నాయి. వాటిని ఖాతరు చేయకుంటే పూర్తిగా వారి అకౌంట్‌ను తొలగిస్తున్నాయి. సెక్షన్ 16 కమ్యునిటీ స్టాండర్డ్స్ సెక్షన్ కింద ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చాయి. ఈ కొత్త నిబంధన వల్ల భవిష్యత్తులో తమ యూజర్లకు లైంగిక వేధింపులు తగ్గుతాయని ఫేస్‌బుక్ భావిస్తోంది. ఇకపై నిషేదిక వంకాయ, పీచ్‌లను వాడితే.. వాటిని లైంగిక అంశంగానే భావిస్తామని నిబంధనల్లో పేర్కొంది. ఈ నిబంధనలు అతిక్రమించి ఎవరైనా అలాంటి పోస్టులు చేస్తే.. వెంటనే తొలగిస్తామని పేర్కొంది. పదే పదే అదే పనికి పాల్పడితే అకౌంట్‌ను పూర్తిగా డియాక్టివ్ చేస్తామని హెచ్చరించింది. ఈ నిషేదం సాధారణ యూజర్లపై పెద్దగా ప్రభావం చూపదు. అయితే, పోర్న్ స్టార్లు, ‘సెక్స్’ వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వారు తమ వ్యాపార ప్రచారం కోసం మనుషుల రహస్యాంగాలను తలపించే వంకాయ, పీచ్ ఎమోజీలను వాడేస్తున్నారు. అలాగే, సెక్స్ చాటింగ్‌లలో కూడా వీటిని తరచు వాడుతున్నారు. 2015లోనే ఇన్‌స్టాగ్రామ్ వంకాయ ఎమోజీని నిషేదించింది. ఇప్పుడు ఫేస్‌బుక్ కూడా దాన్ని అనుకరిస్తోంది.