భారత్‌కు ఇదే తొలిసారి

SMTV Desk 2019-10-23 16:06:38  

రాంచీ: సౌతాఫ్రికాతో జరిగిన చివరి, మూడో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ 30తో క్లీన్‌స్వీప్ చేసింది. సౌతాఫ్రికాపై ఓ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం భారత్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. 132/8 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాలుగో రోజు బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా ఒక పరుగు మాత్రమే జోడించి ఆలౌటైంది. రెండు ఓవర్లలోనే సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఓవర్‌ను ఉమేశ్ యాదవ్ మెయిడిన్‌గా వేశాడు. ఇక, రెండో ఓవర్‌లో యువ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ రెండు వికెట్లు తీసి సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను 133 పరుగుల వద్దే ముగించాడు.

ఐదో బంతికి బ్రూయిన్ (30)ను ఔట్ చేసిన నదీమ్ తర్వాతి బంతికి ఎంగిడిని వెనక్కి పంపాడు. దీంతో సౌతాఫ్రికాకు ఇన్నింగ్స్ ఓటమి తప్పలేదు. ఇక, దక్షిణాఫ్రికా టెస్టు చరిత్రలోనే ఇది నాలుగో భారీ ఓటమి కావడం గమనార్హం. ఇక, ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో కదం తొక్కిన డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. అంతేగాక సిరీస్‌లో పరుగుల వరద పారించడంతో ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు కూడా రోహిత్‌కే దక్కింది. మరోవైపు విశాఖపట్నం, పుణెలలో జరిగిన తొలి రెండు టెస్టుల్లో కూడా టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో చివరి మ్యాచ్‌కు ముందే కోహ్లి సేనకు సిరీస్ దక్కింది. ఇక, చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

240 పాయింట్లతో
ఈ గెలుపుతో భారత్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాయింట్ల సంఖ్యను 240కి పెంచుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను కూడా భారత్ వైట్‌వాష్ చేసింది. తాజాగా సౌతాఫ్రికాపై కూడా క్లీన్‌స్వీప్ సాధించడంతో భారత్ ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచింది. శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు 60 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. కాగా, భారత్ సొంత గడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. నవంబర్‌లో ఈ సిరీస్ జరుగనుంది. ఇందులో కూడా భారత్ క్లీన్‌స్వీప్ సాధించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. దీంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ ప్రత్యర్థులకు అందనంత ఎత్తుకు చేరడం ఖాయమనే చెప్పాలి.

ఇదిలావుండగా సొంత గడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లి, అజింక్య రహానె, చటేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజాలు నిలకడగా రాణించారు. బౌలింగ్‌లో మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జడేజాలు అద్భుత ప్రతిభను కనబరిచారు. రోహిత్ శర్మ నాలుగు ఇన్నింగ్స్‌లలో 132.25 సగటుతో 529 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 340 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. విరాట్ కూడా 317 పరుగులు సాధించి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. బౌలింగ్‌లో అశ్విన్ (15) వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. షమి, జడేజా చెరో 13 వికెట్లు పడగొట్టారు. ఉమేశ్ కూడా 11 వికెట్లతో సత్తా చాటాడు. యువ స్పిన్నర్ నదీమ్ తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

స్కోరు బోర్డు
భారత్ మొదటి ఇన్నింగ్స్ 497/9 డిక్లేర్.
సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్: డీన్ ఎల్గర్ (సి) సాహా (బి) షమి 2, క్వింటాన్ డికాక్ (సి) సాహా (బి) ఉమేశ్ 4, జుబేర్ హంజా (బి) రవీంద్ర జడేజా 62, డుప్లెసిస్ (బి) ఉమేశ్ 1, బవుమా (స్టంప్డ్) సాహా (బి) నదీమ్ 32, హెన్రిచ్ క్లాసెస్ (బి) రవీంద్ర జడేజా 6, జార్జ్ లిండే (సి) రోహిత్ (బి) ఉమేశ్ 37, డేన్ పీడ్ ఎల్బీబి షమి 4, కగిసో రబడా రనౌట్ 0, అన్రిచ్ నోర్జే ఎల్బీబి నదీమ్ 4, ఎంగిడి నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు 12, మొత్తం 56.2 ఓవర్లలో 162 ఆలౌట్.
బౌలింగ్: మహ్మద్ షమి 104222, ఉమేశ్ యాదవ్ 91403, షాబాజ్ నదీమ్ 11.24222, రవీంద్ర జడేజా 143192, రవిచంద్రన్ అశ్విన్ 121480.
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: క్వింటాన్ డికాక్ (బి) ఉమేశ్ 5, డీన్ ఎల్గర్ (రిటైర్డ్‌హర్ట్)16, జుబేర్ హంజా (బి) షమి 0, డుప్లెసిస్ ఎల్బీబి ఉమేశ్ 4, బవుమా (సి) సాహా (బి) షమి 0, హెన్రిచ్ క్లాసెస్ ఎల్బీబి ఉమేశ్ 5, జార్జ్ లిండే రనౌట్ 27, డేన్ పీడ్ (బి) రవీంద్ర జడేజా 23, బ్రూయిన్ (సి) సాహా (బి) నదీమ్ 30, కగిసో రబడా (సి) జడేజా (బి) అశ్విన్ 12, అన్రిచ్ నోర్జే (నాటౌట్) 5, ఎంగిడి (సి) అండ్ (బి) నదీమ్ 0, ఎక్స్‌ట్రాలు 6, మొత్తం 48 ఓవర్లలో 133 ఆలౌట్.
బౌలింగ్: మహ్మద్ షమి 106103, ఉమేశ్ యాదవ్ 91352, రవీంద్ర జడేజా 135361, షాబాజ్ నదీమ్ 61182, రవిచంద్రన్ అశ్విన్ 103281.