కిస్ మిస్ లు తింటే ఎన్నో లాభాలు

SMTV Desk 2019-06-01 14:11:59  Kiss miss,

పాయసంలో, సేమియాలో.. వేసుకొని లొట్టలేసుకుంటూ లాగించే ఎండుద్రాక్ష ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అటు నోటికి రుచిని ఇస్తూనే.. ఆరోగ్యాన్నివ్వడంలో కూడా ముందుంటుంది. ఎన్నో లాభాలున్న ఎండుద్రాక్ష గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా!

మనమంతా ముద్దుగా కిస్మిస్​ అని పిలుచుకునే ఎండుద్రాక్షను వంటల్లో వాడుతాం. నేరుగా కూడా తింటాం. ఎలా తిన్నా దాని టేస్టే వేరు. తీపి వంటకాలకు అదనపు రుచిని అందించడంలో ఎండుద్రాక్ష ముందే ఉంటుంది. చూడడానికి ఎండిపోయి పీలగా ఉన్నా.. శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో మాత్రం బలిష్టమైనవి ఇవి. ఎండుద్రాక్షలో విటమిన్​– బి, ఐరన్​, ఫాస్పరస్​, మెగ్నీషియం, పొటాషియం, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఏ వయసు వారైనా ఎండుద్రాక్ష హాయిగా తినేయొచ్చు. ఎండుద్రాక్షల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టుకొని ఉదయాన్నే పరగడుపున తింటే.. అనారోగ్య సమస్యలని దూరం పెట్టొచ్చు.

అధిక బరువుతో బాధపడేవారికి ఎండుద్రాక్ష మంచి రుచికరమైన ఔషధం. ఇవి మన శరీరంలో ఆకలిని పెంచే లెప్టిన్​ అనే రసాయనం విడుదలను నియంత్రిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు ఎండుద్రాక్షను తింటే.. ఆకలి తగ్గిపోతుంది. దాంతో అనవసరంగా తినడం తగ్గుతుంది. సన్నగా ఉండేవారు రెగ్యులర్​గా ఎండుద్రాక్ష తింటే.. అందులోని పోషకాలు శరీరానికి అంది పుష్టిగా, బలంగా తయారవొచ్చు. జీర్ణశక్తి సమస్యలతో బాధపడేవారికి ఎండుద్రాక్ష మంచి పరిష్కారం. ఎండుద్రాక్షలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్​ గుణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి.

ఉదర సంబంధ వ్యాధులతో బాధపడేవారు రెగ్యులర్​గా ఎండుద్రాక్ష తింటే ఫలితం ఉంటుంది. క్యాల్షియం అధికంగా లభించే ఆహార పదార్థాల్లో ఎండుద్రాక్ష కూడా ఒకటి. కీళ్ల నొప్పులు, ఎముకల పటుత్వం సమస్యలతో బాధపడేవారికి ఎండుద్రాక్ష ఉపశమనం ఇస్తుంది. గ్లాసెడు పాలలో రెండు, మూడు ఎండుద్రాక్షలు వేసి మరిగించి , వడకట్టి ఆ పాలను ఎదిగే పిల్లలకు రెగ్యులర్​గా తాగిస్తే.. వారిలో ఎముకలు గట్టిపడతాయి. మెనోపాజ్​ దశకు చేరుకున్న మహిళలు రెగ్యులర్​గా ఎండుద్రాక్ష తింటే మంచిది. ఇందులోని బోరెన్​ అనే ఖనిజ లవణం, క్యాల్షియం శరీరంలో కలిసి కీళ్ల నొప్పుల సమస్యను నివారిస్తాయి.

ప్రతిరోజూ రెండు వెల్లుల్లి రేకలతో పాటు నాలుగు ఎండుద్రాక్షలు కలిపి తీసుకుంటే బీపీ అదుపులోకి వస్తుంది. ఇందులోని బి – విటమిన్, ఫాస్పరస్​ గుండె మీద ఒత్తిడిని తగ్గిస్తాయి. రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గించడానికి కిస్మిస్​​లోని పొటాషియం బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు.. చర్మవ్యాధుల నుంచి తట్టుకునే శక్తిని కూడా శరీరానికి ఇస్తుంది.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్​ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎండుద్రాక్షలో క్యాన్సర్​ కణాలతో పోరాడే ఫ్రీ రాడికల్స్​ పుష్కలంగా ఉంటాయి. కామెర్ల వ్యాధితో బాధపడేవారు రోజూ రెండు పూటలా రెండేసి చొప్పున ఎండుద్రాక్షలు తీసుకుంటే వ్యాధి తగ్గుముఖం పడుతుంది. శ్వాసనాళ సమస్యలతో బాధపడేవారు కిస్మిస్​ తింటే.. గొంతులోని కఫం తగ్గి ఉపశమనం కలుగుతుంది.