కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ బాబు

SMTV Desk 2019-02-25 13:45:18  Chandrababu Naidu, Jaganmohan Reddy, Chandrasekhar Rao, Narendra Modi, Criticized, TDP, YCP

అమరావతి, ఫిబ్రవరి 25: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నాయకులు తమ తమ పనులలో బీజిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలతో సోమవారం ఉదయం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ జగన్ ను సామంతరాజును చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ అంటే ద్వేషమని, కానీ జగన్ అంటే మాత్రం చాలా ప్రేమ అంటూ వ్యాఖ్యానించారు. ఏపీని కేసీఆర్ తోలుబొమ్మను చేసి ఆడుకోవాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదన్న కేసీఆర్ తో జగన్ దోస్తీ కట్టారంటూ మండిపడ్డారు. జగన్ ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ కు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అందర్నీ కలపాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కుల రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

రాష్ట్రంలో వైసీపీ పార్టీ నేతలు చిచ్చుపెట్టి కుల రాజకీయాలు చెయ్యాలని చూస్తోందన్నారు. ప్రశాంత్ కిషోర్ సూచనలతో బీహార్ నుండి ఏపీలో కుల రాజకీయాలు చెయ్యాలని చూస్తున్నారని తెలిపారు. ఏపీలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ చేతుల్లోకి వెళ్లిపోతుందన్నారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోదీపై కూడా విరుచుకుపడ్డ బాబు, మోదీ పెద్ద నటుడు అంటూ విమర్శించారు. తన స్వార్థం కోసం మోదీ ఎంతకైనా తెగిస్తాడన్నారు. అవసరం లేదనుకుంటే వ్యవస్థలను అడ్డంపెట్టుకుని దాడులు చేయిస్తారని చంద్రబాబు ఆరోపించారు.