కార్ గుర్తుకు మార్పులు చేయనున్న తెరాస

SMTV Desk 2019-02-09 11:33:04  Telangana, TRS, Car, Truck, SP, Chandrasekhar Rao, Vinod Kumar, Election Commission

హైదరాబాద్, ఫిబ్రవరి 09: తెలంగాణా రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీ గుర్తు కారును పోలిన విధంగా ఉండే ట్రక్కు, ఇతర గుర్తుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంలో తమకు దారి చూపాలని ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్‌ పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పిర్యాదు పై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించారు. తమ గుర్తును ఎలా ఉండాలని అనుకుంటున్నారో తెలపాలని ఆదేశించింది. దీంతో ఎంపి వినోద్‌కుమార్‌ మార్పు చేసిన కారు గుర్తును ఎన్నికల సంఘానికి ఈరోజు సమర్పించారు. కాగా, ఇటీవల తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పాల్గొన్న సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీకి ఎన్నికల సంఘం ట్రక్కు గుర్తు కేటాయించింది. అలాగే పార్వర్డ్‌ బ్లాక్‌ పోటీ చేయని కొన్ని నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు ఇదే గుర్తు కేటాయించింది. ఆ ట్రక్కు గుర్తు కారు గుర్తును పోలి ఉండడంతో చాలా మంది నిరక్షరాస్య గ్రామీణ ఓటర్లు పోల్చుకోవడంలో పొరబడ్డారని, దీనివల్ల తమ పార్టీకి భారీ నష్టం జరిగిందని గత ఏడాది డిసెంబరులో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇందుకు కొన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్‌ను ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు.