చలికాలంలో ఆలివ్ ఆయిల్‌ ఎలా పనిచేస్తుంది?

SMTV Desk 2019-01-07 13:51:51   Olive Oil , Winter Health Care , Skin Care , Hair Care , Beauty Tips

వంటలలో ఆలివ్ ఆయిల్‌ ఉపయోగించడం వల్ల శరీరానికి పనికొచ్చే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. ఆలివ్ ఆయిల్ వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అధిక బరువు అదుపులో ఉంటుంది. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇంకా ఎన్నో ఉపయోగాలు మనకు కలుగుతాయి. అయితే ఆలివ్ ఆయిల్‌తో శరీరానికే కాదు, మన చర్మానికి కూడా సంరక్షణ కలుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఆలివ్ ఆయిల్ చర్మానికి రక్షణనిస్తుంది. చర్మం పగలకుండా చూస్తుంది. ఆలివ్ ఆయిల్‌తో చలికాలంలో మన చర్మాన్ని ఎలా సంరక్షించుకోవచ్చో తెలుసుకుందాం.

1. స్నానం చేసేందుకు 30 నిమిషాల ముందు శరీరానికి ఆలివ్ ఆయిల్ రాసుకోవాలి. అనంతరం స్నానం చేస్తే చర్మం పగలకుండా మృదువుగా ఉంటుంది. చర్మం తెల్లగా మారకుండా ఉంటుంది.

2. ఆలివ్ నూనెలో కొద్దిగా చక్కెర కలిపి చర్మానికి మర్దనా చేస్తే చర్మం మృదుత్వాన్ని పొందుతుంది.

3. ఆలివ్‌నూనె చర్మానికే కాదు, వెంట్రులకూ మంచిదే. గుడ్డు తెల్ల సొనలో కొద్దిగా ఆలివ్‌నూనె కలిపి తలకు రాసుకోవాలి. 30 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే వెంట్రుకలు పట్టులా మారుతాయి. మృదుత్వాన్ని పొందుతాయి.

4. నిత్యం వాడే షాంపూ లేదా కండిషనర్‌లో ఆలివ్‌నూనె కలిపి వాడినా ఫలితం ఉంటుంది. వెంట్రుకల సమస్యలు పోతాయి. చుండ్రు తగ్గుతుంది.

5. నిమ్మరసం, ఆలివ్‌నూనె కలిపి మిశ్రమంగా చేసి జుట్టుకు పట్టించి కొంత సేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు పోతుంది. వెంట్రుకలు నిగారింపును పొందుతాయి.