నవ్వితే మ‌తిమ‌రుపు తగ్గుతుంది

SMTV Desk 2019-01-05 12:43:37  Health, Laugh, Retentivity

లాఫ్.. అండ్ లాఫ్.. అంటిల్ యూ కాఫ్ నవ్వు గురించి ఓ తత్వవేత్త చెప్పిన మాట ఇది. నిజమే.. ట్రై అండ్ ట్రై అంటిల్ యు రీచ్ ద స్కై అన్నట్టు. దగ్గు వచ్చేదాక నవ్వితే చాలా నవ్వినట్టు. బాధ‌ను మ‌రిపిస్తూ, విచారాన్ని పోగొట్టి, సంతోషాన్ని క‌లిగించే న‌వ్వు మ‌న‌కు ఉత్సాహాన్ని కూడా తెచ్చి పెడుతుంది. అలాగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా న‌వ్వు ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. వొత్తిడి, ఆందోళ‌న దూర‌మ‌వుతాయి. ఇవే కాకుండా న‌వ్వ‌డం వ‌ల్ల జ్ఙాప‌క‌శ‌క్తి కూడా పెరుగుతుంద‌ట‌. ఇదే విష‌యాన్ని అధ్య‌యనాలు వెల్లడిస్తున్నాయి. వొత్తిడి వ‌ల్ల మ‌న‌లో విడుద‌ల‌య్యే కార్టిసాల్ అనే హార్మోన్ మ‌న మెద‌డు ప‌నితీరును దెబ్బ తీస్తుంది. మ‌న‌ల్ని మాన‌సికంగా కుంగిపోయేలా చేస్తుంది. దీంతో జ్ఞాప‌క‌శ‌క్తి కూడా త‌గ్గిపోతుంది. అయితే ఇది జ‌ర‌గ‌కుండా ఉండాలంటే.. రోజూ న‌వ్వాల‌ని సైంటిస్టులు చెబుతున్నారు. రోజూ ఆనందంగా ఉంటూ న‌వ్వ‌డం వ‌ల్ల మ‌తిమ‌రుపు రాకుండా ఉంటుంద‌ని, జ్ఞాప‌కశ‌క్తి కూడా పెరుగుతుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

కాలిఫోర్నియాలోని లోమా లిండా యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు వొక అధ్య‌య‌నం చేప‌ట్టారు. కొంద‌రు వృద్ధులకు 20 నిమిషాల పాటు హాస్య‌భ‌రిత వీడియోల‌ను చూపించారు. ఆ స‌మ‌యంలో వారి జ్ఞాప‌క‌శ‌క్తిని ప‌రిశీలించారు. అలాగే వారిలో కార్టిసాల్ స్థాయిల‌ను కూడా ప‌రిశీలించారు. దీంతో తేలిందేమిటంటే... వారు న‌వ్వినంత సేపు వొత్తిడి బాగా త‌గ్గింద‌ని, జ్ఞాప‌క‌శ‌క్తి పెరిగింద‌ని, కార్టిసాల్ స్థాయిలు బాగా తగ్గాయ‌ని తేల్చారు. అందువ‌ల్ల కొంత సేపు అయినా స‌రే అన్ని బాధ‌ల‌ను మ‌రిచిపోయి ఆనందంగా న‌వ్వాల‌ని సైంటిస్టులు వెల్ల‌డిస్తున్నారు.

కార్టిసాల్ వంటి హార్మోన్ల ప్ర‌భావాన్ని, వొత్తిడిని త‌గ్గించుకునేందుకు, బీపీ త‌గ్గేందుకు, ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డేందుకు, ఉత్సాహం వ‌చ్చేందుకు న‌వ్వు దోహ‌ద‌ప‌డుతుంద‌ని సైంటిస్టులు పేర్కొంటున్నారు. న‌వ్వ‌డం వ‌ల్ల మ‌న మెద‌డులో ఎండార్ఫిన్లు, డోప‌మైన్ ఉత్ప‌త్తి పెరుగుతుంది. ఇవి సంతోషాన్ని, హుషారును తెచ్చి పెడ‌తాయి. దీంతో జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. కనుక సాధ‌ర‌ణ వ్య‌క్తులే కాక, వృద్ధులు కూడా నిత్యం న‌వ్వ‌డం వ‌ల్ల సొంతంగా తమ పనులను తాము చేసుకోవటానికి, హాయిగా జీవించటానికి వారికి జ్ఞాపకశక్తి చాలా కీలకం కాబట్టి వీరికి ఇతర చికిత్సలతో పాటు నవ్వు చికిత్సలనూ జోడించటం అవసరమని పరిశోధకులు తేల్చేశారు.