రూపాయికే బంగారం కొనుగోలు

SMTV Desk 2018-12-18 18:54:19  India, Gold price, Online shopping

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 18: భారత దేశంలో బంగారాన్ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా దేశంలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యల కారణంగా బంగారం డిమాండ్ తగ్గింది. వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి ప్రభుత్వం బంగారం కొనుగోళ్లను ప్రోత్సహించడం లేదు. భారతీయులు వాడే బంగారమంతా దిగుమతి చేసుకునేదే. దీని కారణంగా వివిధ దేశాలతో భారత్ వాణిజ్య లోటు పెరిగిపోతున్నది. దీనిని అరికట్టడానికి ప్రభుత్వం పసిడిపై పన్నులు భారీగా పెంచేసింది. దీంతో సహజంగానే డిమాండ్ తగ్గింది. అయితే ఈ తగ్గిపోయిన డిమాండ్‌ను మరో రూపంలో వ్యాపారస్తులు భర్తీ చేస్తున్నారు. అది ఆన్‌లైన్‌లో బంగారం సేల్. పేటీఎం, ఫోన్ పె లాంటి వాలెట్లు వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోళ్లు పెరిగిపోయాయి.

తక్కువలో తక్కువ రూపాయికి కూడా బంగారం కొనే వీలు ఇవి కల్పిస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది ఈ రూపాయి చెల్లించే బంగారం కొనుగోలు చేస్తున్నట్లు సేఫ్‌గోల్డ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఎండీ గౌరవ్ మాథుర్ వెల్లడించారు. అయితే కనీసం గ్రాము గోల్డుకు సరిపడా డబ్బులు చెల్లించిన తర్వాతే ఆ బంగారాన్ని ఈ సంస్థలు కస్టమర్లకు చేరవేస్తున్నాయి. ఇలా రూపాయి రూపాయి బంగారం పోగేసి కొంటున్నవాళ్లూ ఉన్నారు. పైగా ఆన్‌లైన్‌లో సునాయాసంగా అయిపోయే లావాదేవీ కావడంతో చాలా మంది దీనివైపు మొగ్గు చూపుతున్నారు. సేఫ్‌గోల్డ్‌లో ఇప్పటికే 30 లక్షల మంది బంగారం కొనుగోలు చేయడం విశేషం. వచ్చే ఏడాదికి వీళ్ల సంఖ్యను కోటిన్నర వరకు తీసుకెళ్లాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. సేఫ్‌గోల్డ్‌తోపాటు ఆగ్‌మాంట్ ఎంటర్‌ప్రైజెస్, పేటీఎం, వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాథవే ఈ ఆన్‌లైన్ బంగారం బిజినెస్‌లో దూసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాయి.