ప్లాస్టిక్ నిషేధం.. ఇబ్బందుల్లో బహుళజాతి సంస్థలు..

SMTV Desk 2018-06-29 17:24:31  plastic banned in maharastra, plastic banned, amazon, maharastra

ముంబై, జూన్ 29 : ప్రపంచ పర్యావరణానికి పెనుముప్పుగా సంభవించిన ప్లాస్టిక్ పై మహారాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. ఈ నిషేధంతో రాష్ట్రంలోని బహుళ జాతి సంస్థలు తెగ ఇబ్బందులు పడుతున్నాయి. వాడి పడేసే ప్లాస్టిక్‌ వినియోగం విషయంలో నిబంధనలు కాస్త సడలించాలని అమెజాన్‌, హెచ్‌ అండ్‌ ఎం లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ప్రభుత్వం వద్ద లాబీయింగ్‌ చేస్తున్నట్లు సమాచారం. దీంతో అమెజాన్‌ లాంటి ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థలకు వస్తువుల డెలివరీ ప్యాకింగ్‌కు బాగా ఖర్చు అవుతోంది. రిటైలర్స్‌, శీతల పానీయాలు తయారీదారులకు, మంచినీళ్ల బాటిళ్ల అమ్మకందారులపై ఈ నిషేధం ఎఫెక్ట్‌ బాగా పడుతోంది. దీంతో ఆయా కంపెనీలు ప్లాస్టిక్‌ వాడకంపై విధించిన నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అమెజాన్‌, హెచ్‌ అండ్‌ ఎం, కోకా కోలా సహా పలు కంపెనీల ప్రతినిధులతో పాటు కొన్ని ప్లాస్టిక్‌ పరిశ్రమ సంఘాలు ప్లాస్టిక్‌ నిషేధం అమలు చేయడానికి ముందు రోజే మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను కలిశారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, కోకా కోలా కంపెనీలు ఈ అంశంపై స్పందించడానికి నిరాకరించాయి. ప్లాస్టిక్‌ రీసైకిల్‌, పునర్వినియోగానికి తాము మద్దతు ఇస్తామని హెచ్‌ అండ్‌ ఎం కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. మున్ముందు పరిష్కార మార్గాలను చూసుకునేందుకు ప్రభుత్వం నిబంధనలపై స్పష్టత ఇవ్వాలని కంపెనీలు పేర్కొన్నాయి.