పోస్ట్‌వర్కవుట్ల ప్రాధాన్యం తెలుసా..!

SMTV Desk 2018-05-10 15:36:27  post work outs, after exercise, post work out tips, hyderbad

హైదరాబాద్, మే 10 : వ్యాయామాలు చేయడానికి ముందు వార్మప్‌లు చేస్తారు. వాటితోపాటూ పోస్ట్‌వర్కవుట్లూ ముఖ్యమే! >> పేరుకు తగ్గట్టే ప్రధాన వ్యాయామాల తర్వాత చేసేవి ఇవి. వ్యాయామంతో వేడెక్కిన శరీరాన్ని తిరిగి మామూలు ఉష్ణోగ్రతలోకి తీసుకురావడానికి ఉపయోగపడతాయి. పట్టేసిన కండరాలనీ మామూలు స్థితికి తెస్తాయి. మరుసటి రోజు సులభంగా వ్యాయామం చేసేందుకు శరీరాన్ని సిద్ధం చేస్తాయి. >> వీటిని చేయకపోతే వ్యాయామం తాలూకూ అలసట, మత్తు రోజంతా వేధిస్తుంది. వేగంగా పరుగుపెట్టినప్పుడూ, బరువులెత్తడం పూర్తికావడంతోనే మీరు మామూలు పనుల్లో పడితే శరీరం రోజంతా అలసటతోనే ఉంటుంది. >> ఏసీ గదుల్లో వ్యాయామం చేసినా శరీరం, కండరాలూ నీటిని కోల్పోతాయి. అందుకని చాలా నీళ్లు తీసుకోవాలి. ఆ తర్వాతే పోస్ట్‌వర్కవుట్‌ మొదలుపెట్టాలి. ఇవి చాలా రిలాక్స్‌డ్‌గా చేయాల్సిన వ్యాయామాలు. చేయడానికి ఐదు నుంచి ఏడు నిమిషాల సమయం సరిపోతుంది. >> మీరు ప్రధాన వ్యాయామంలో భాగంగా వేగంగా పరుగుపెట్టారనుకుందాం. రెండు నిమిషాలు నెమ్మదిగా జాగింగ్‌ చేయడమే మీ పోస్ట్‌ వర్కవుట్‌. ఇక చేతులూ, భుజాలకి సంబంధించిన వ్యాయామం చేస్తే భుజాలని వెనక్కీ, ముందుకీ గుండ్రంగా తిప్పడం కూడా దీనికిందకే వస్తుంది. >> చివరిగా.. మీ రెండు చేతులతో మోకాలు వంచకుండా నేలని తాకండి. ఆ చేతుల్ని పైకి తెస్తూ దీర్ఘశ్వాస తీసుకోండి. దాంతో శరీరం వ్యాయామం తాలుకూ అలసట మొత్తాన్నీ మరిచిపోతుంది!