స్మశానాన్ని తలపిస్తున్న సిరియా...

SMTV Desk 2018-02-27 16:06:50  Ghouta, syria, civil war, Syria conflict

డమస్కస్, ఫిబ్రవరి 27 : మానవత్వం మరిచి.. పసి పిల్లలు అని చూడకుండా తమ రాజ్య కాంక్షే పరమావధిగా రెచ్చిపోతున్న క్రూరులు... బాల్య జీవితాన్ని తమ తుపాకీ తూటాలకు బలి చేస్తున్న రాక్షసులు.. చూసే ప్రతి ఒక్కరి హృదయం ద్రవించేలా, అసలు మనం రాతి యుగంలో ఉన్నామా.. లేక సాంకేతికత అందిపుచ్చుకున్న ఇప్పటి కాలంలో ఉన్నామా అనే సందేహం కలిగేలా..జరుగుతున్నా ఈ మారణహోమంకు కేంద్రబిందువు సిరియాలోని గౌటా. ఇంతా నరమేధం అవసరమా అంటే.. ఉగ్రవాద విముక్తి పోరాటంలో ఇవన్ని తప్పదన్నట్లు ప్రభుత్వాలు చెప్పడం ఎంతో విచారకరం. కొద్ది రోజులుగా సిరియాలోని గౌటా నగరంపై ప్రభుత్వ దళాల దాడుల్లో కనీసం 700 మంది పౌరులు ఆసువులుబాసారు. మరణించిన వారిలో 200 మంది చిన్నారులు, 110 మంది మహిళలు కూడా ఉన్నారు. వైమానిక దాడుల్లో ఆస్పత్రి భవనాలు, వందకొద్దీ ఇళ్లు నేలమట్టమయ్యాయి. ముందు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తర్వాత దాడి చేయవలిసిన ప్రభుత్వ బలగాలు నిర్దాక్షణ్యంగా జనావాసాలపై బాంబులు జారవిడుస్తున్నాయి. దేశ రాజధాని డమస్కస్‌ శివారు నగరమైన గౌటా 2013లో ప్రభుత్వ బలగాల నీడలో ఉంది . అయితే మిగతా ప్రాంతాల్లో చావుదెబ్బతిన్న మిలిటెంట్లు చాలా మంది సాధారణ జనంతో కలిసిపోయి గౌటా నగరంలో తలదాచుకున్నారు. 2017నాటికి వారు తిరిగి ఆయుధ సంపత్తిని దక్కించుకొని గౌటాలో సొంత పెత్తనం చెలాయించే స్థితికి చేరుకున్నారు. ప్రస్తుతం తిరుగుబాటు దళాలు గౌటా నగరాన్ని రొట్టెను పంచుకున్నట్లు పంచుకున్నాయి. తహ్రీర్‌ అల్‌ షమ్‌, అల్‌ రహమాన్‌ లీజియన్‌, జైష్‌ అల్‌ ఇస్లామ్‌ అనే గ్రూపులు తమలోతాము కలహించుకుంటూ, ప్రభుత్వ బలగాలతోనూ తలపడుతూ ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి.