టీడీపీలోకి చేరనున్న కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు..

SMTV Desk 2017-09-11 13:09:23  Nallari Kiran Kumar Reddy, nallaari kishore kumar reddy, tdp party, minister lokesh.

అమరావతి, సెప్టెంబర్ 11 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు టీడీపీలోకి చేరుతున్నారనే వార్త ఇప్పుడు ప్రచారంలో ఉంది. ఇప్పటికే పలు ముఖ్య నేతల ద్వారా మంత్రి నారా లోకేష్ తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే చిత్తూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషోర్ టీడీపీలోకి వస్తే పార్టీ మరింత బలపడే అవకాశాలు ఉన్నట్లు లోకేష్ భావిస్తున్నారట. అంతేకాకుండా ఈ విషయమై జిల్లాకు చెందిన మంత్రి అమరనాథ రెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా రామచంద్రారెడ్డి తదితరులు పలుమార్లు చర్చలు కూడా జరిపారట. ఈ నేపధ్యంలో తన ముఖ్య అనుచరులతో మంతనాలు సాగించిన కిషోర్ టీడీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ రాజకీయ ప్రకటనపై తన తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన ఆయన "జై సమైక్యాంధ్ర" పార్టీని పెట్టుకున్నారు. అయితే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న కిరణ్ కుమార్ కొన్నిసార్లు బీజేపీలో చేరుతారని, మరి కొన్నిసార్లు వైసీపీలో చేరుతారని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి పార్టీ టీడీపీలోకి వస్తుండడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.