హుజూర్‌నగర్.. లో గెలుపు దిశగా తెరాస ?

SMTV Desk 2019-10-22 12:15:05  

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన టీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మిశ్రమ ఫలితాలు చూడాల్సి వచ్చింది. దీంతో, టీఆర్ఎస్‌కు ఎదురుగాలి వీస్తుందనే చర్చ సాగింది. అయితే, ఆ వెంటనే హుజూర్‌నగర్‌ బైపోల్ రూపంలో మరో ఎన్నిక గులాబీ పార్టీకి సవాల్ విసిరింది. ఇది కాంగ్రెస్ కంచుకోట కావడం.. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం కావడంతో.. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టాలని టీఆర్ఎస్ పూనుకుంది. దానికి అనుగుణంగా ప్లాన్ చేసింది.. మంత్రులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఇలా అందరినీ రంగంలోకి దించేసింది. మరోసారి విక్టరీ కొట్టాలన్న కసితో ఉత్తమ్.. ఆయన భార్యను రంగంలోకి దింపారు. మొత్తానికి హుజూర్‌నగర్ బైపోల్‌లో కీలకఘట్టమైన పోలింగ్ నిన్న సాయంత్రం 5 గంటలకు ముగిసింది.

దాదాపు హుజూర్‌నగర్‌లో 84 శాతం పోలింగ్ నమోదైంది. అయితే, టీఆర్ఎస్ విజయం ఖాయమనే లెక్కలు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్లాన్ చేసి మరీ కాంగ్రెస్‌ పార్టీని దెబ్బ కొట్టిందట గులాబీ పార్టీ. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న మేళ్లచెరువులోనే ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చేలా ప్లాన్ చేశారట. ఇక మరోవైపు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఓటర్లకు పంచిన డబ్బులోనూ తేడాల ప్రభావం కూడా విజయాన్ని ప్రభావితం చేస్తోందట. లోకల్ టాక్ ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు రూ.500 చొప్పున.. అదీ 60 శాతం మంది ఓటర్లకే పంచితే.. అధికార పార్టీ మాత్రం ఓటరుకు వెయ్యి రూపాయలు ముట్టచెబ్బినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఇక లోకల్‌లీడర్లకు పంట పండిందట.. ఒక్కొక్కరికి రూ.2 లక్షలకు పైగా ముట్టాయట.. దీంతో.. గులాబీ పార్టీ విజయం నల్లేరుపై నడకే అంటున్నారు. అంతేకాదు.. టీఆర్ఎస్ అభ్యర్థి సైదారెడ్డి 10 వేల మెజార్టీతో గెలవడం ఖాయమంటున్నారు. ఇంకా కలిసి వస్తే మెజార్టీ 20 వేలు కూడా దాటనుందని అంచనా వేస్తున్నారు.