అన్నదమ్ముల అనుబంధం చిన్నప్పటికే పరిమితమా?

SMTV Desk 2019-10-22 12:13:28  

తోడపుట్టిన అన్నదమ్ములు అంటే, కేవలం ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్లు మాత్రమే కాదు.. కుటుంబ విలువలను, వారసత్వాన్ని ముందుతరాలకు అందించే వాళ్లు. అనుబంధాలు ఆప్యాయతలు పంచుకుంటూ, అమ్మనాన్నల ఆలనా పాలన చూసుకునేవాళ్లు. అలాంటి వాళ్లు అవసరం వస్తే తప్ప కలుసుకోలేని పరిస్థితులు వచ్చేశాయి. ‘తమ్ముడు, అన్నా ’ పిలుపుల కంటే ఆస్తులు, డబ్బు, హోదాలు ఎక్కువైపోయాయి. కుటుంబ చట్రాన్ని ముందుకు నడిపే అన్నదమ్ముల మధ్య పొరపొచ్చాలు పోవాలంటే.. ? విదేశాలకు ఎగిరిపోయిన బంధాలు అప్పుడప్పుడన్నా ఆప్యాయంగా కలవాలంటే..!?
కుటుంబం:
అన్నదమ్ములపై కుటుంబాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పుడు ఒకే కుటుంబంలో పుట్టి, పెరుగుతారు. దాంతో తల్లిదండ్రుల ప్రభావం ఇద్దరి మీదా పడుతుంది. అక్క, చెల్లెళ్లు కూడా ఉంటే వాళ్లతో కలిసిపెరుగుతారు, అందువల్ల వాళ్ల ప్రభావమూ ఉంటుంది. ఇలా.. అనుబంధాల మధ్య జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో కుటుంబం వల్లే అన్నదమ్ములిద్దరూ మొదట తెలుసుకుంటారు. కానీ పెళ్లయిన తర్వాత ఇద్దరికీ భార్యల వల్ల వేరువేరు కుటుంబాలతో సంబంధాలు ఏర్పడతాయి. దాంతో వాళ్ల ఆలోచనలు, అభిప్రాయాల్లో మార్పులు రావచ్చు. అలాగని పాత బంధాలను తెంచుకోకూడదు. అందరితో కలిసి ఉండాలి. చిన్నచిన్న తేడాలు వచ్చినా, పట్టించు కోకూడదు. అలాగే కుటుంబాలు వేరైనా చిన్నప్పటి రిలేషన్స్‌ ను వదులుకోకూడదు. అందరం ఒకే కుటుంబం అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఒకటిగా కలిసి కుటుంబ ఆదర్శాలు, సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లేది అన్నదమ్ములే.ప్రేమాభిమానాలు తర్వాతి తరానికి అందిం చేది కూడా వాళ్లే. అందుకే అన్నదమ్ములు ఒకటిగా కలిసిపోవాలి. చిన్నప్పుడే కాదు, పెద్దయ్యాక కూడా. తల్లిదండ్రుల కోసమే కాదు, ఇద్దరిళ్లలో ఏ అవసరం వచ్చినా ఒకరిని మరొకరు ఆదుకోవాలి. పెద్దయ్యాక చిన్నప్పటిలా కలిసి బతకడం కుదరకపోవచ్చు. పండుగలు, పెళ్లిళ్లు వంటి వేడుకలప్పుడు అయినా కలుసుకోవాలి. ఒకరితో మరొకరు ఫోన్‌‌లో మాట్లాడుకోవాలి. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. పెళ్లిళ్లు అయ్యాక భార్యలతో వాళ్ల బంధం గురించి చెప్పి, కుటుంబ విలువలను కాపాడుకోవాలి. ఎవరిదారి వాళ్లదే అన్నట్లు ఉండొద్దు. స్నేహితులు ఒకే కంచంలో తిని, ఒకే మంచంలో పడుకున్నా మని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. కానీ అన్నదమ్ములు చిన్నప్పుడు అలాగే బతుకుతారు.
పోలికలొద్దు:
ఒకే ఇంట్లో పుట్టి పెరిగిన అన్నదమ్ములు ఒకేలా ఉండరు. ఒకరు అల్లరి చేయొచ్చు. మరొకరు నిదానంగా ఉండొచ్చు. ఆటపాటల్లో ఒకరు ముందు ఉంటే.. ఇంకొకరు చదువులో ఫస్ట్‌‌ రావచ్చు. అన్నదమ్ములు అయినంత మాత్రాన అన్నింటిలో పోలిక ఉండాలనేంలేదు. ఎవరి టాలెంట్‌ తో వాళ్లు ఎదుగుతారు. తల్లిదండ్రులు ‘అన్న చూడు ఎంత బాగా చదువుతాడో, తమ్ముడు చూడు ఎప్పుడూ అన్నింటిలో ముందుంటాడు’ లాంటి మాటలతో ఒకర్ని మరొకరితో పోల్చకూడదు. అలా చేయడం వల్ల వాళ్ల మధ్య అసూయ, ద్వేషం లాంటివి ఏర్పడతాయి. అన్నదమ్ముల బంధాన్ని చెడగొట్టే పోలికలు అసలు పనికిరావు. అవి చిన్నప్పటితో పోవు. పెద్దయ్యాక కూడా వాళ్ల రిలేషన్‌‌పై ప్రభావం చూపుతాయి. పెరిగే కొద్దీ వాళ్ల తెలివితేటలు, చదువు, ఉద్యోగం, పెళ్లి.. లాంటి వాటిని బట్టి వాళ్ల జీవితాలు మారిపోతాయి.