అక్టోబర్ 30న సకలజనుల సమరభేరి

SMTV Desk 2019-10-21 19:00:20  

టిఎస్ ఆర్టీసీ సమ్మె ముగింపుకు సిఎం కేసీఆర్‌ ఆసక్తి చూపకపోవడంతో ఆర్టీసీ సమ్మెను మరింత ఉదృతం చేయాలని ఆర్టీసీ జేఏసీ నేతలు నిర్ణయించి అందుకు కార్యాచరణను కూడా ప్రకటించారు. ఆర్టీసీ సమ్మెకు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ పూర్తి మద్దతు ఇస్తున్నందున అవి కూడా ఆర్టీసీ కార్మికుల పోరాటంలో చురుకుగా పాల్గొనాలని నిర్ణయించుకొన్నాయి. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రతిపక్ష నేతలు పాల్గొని సమ్మె కొనసాగింపుపై చర్చించారు. ఈ నెల 30న సకల జనుల సమరభేరి పేరిట 4 లక్షలమందితో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి రాష్ట్రంలోని కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల మద్దతు కోరాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డితో సహా ఐకాసా నేతలు, కాంగ్రెస్‌ తరపున వి.హనుమంతరావు, టిజేఎస్‌ అధినేత కోదండరాం, బిజెపి తరపున జితేందర్ రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ, మోత్కుపల్లి నర్సింహులు ఇంకా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి కార్యాచరణ ప్రకటించారు.

సోమవారం: ఆర్టీసీ కార్మికులు కుటుంబాలతో డిపోల వద్ద బైటాయింపు

మంగళవారం : తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో సమావేశాలు నిర్వహించి సమ్మెకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేయడం.

బుదవారం : అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను కలిసి మద్దతు కోరుతూ వినతిపత్రాలు అందజేయడం.

గురువారం : డిపోలవద్ద ఆర్టీసీ మహిళా కండెక్టర్లు దీక్షలు

శుక్రవారం : ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు, పిల్లలతో దీక్షలు

శనివారం : సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించకపోవడం వలన దీపావళి పండుగనా పస్తున్నామని తెలియజేస్తూ నిరసనలు.

ఆదివారం : రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందితో సకలజనుల సమ్మె భేరీ.