కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య..

SMTV Desk 2019-10-16 15:28:08  

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేరు వినగానే వెంటనే గుర్తుకు వచ్చేది.. ఆయనకు ఎర్రవల్లిలో ఉన్న వ్యవసాయ క్షేత్రం.. అధికారిక కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉండే కేసీఆర్.. సమయం దొరికిందంటే ఫామ్‌హౌస్‌కు వెళ్లి.. అక్కడ ఏ పంటలు వేస్తున్నారు, పంట ఎలా వస్తుంది.. అనే విషయాలను దగ్గరుండి ఆరా తీస్తారు. అయితే, కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఇవాళ ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఫామ్‌హౌస్‌లో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు.. ఏకే 47తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. 12వ బెటాలియన్‌కు చెందిన వెంకటేశ్వర్లు స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా ముత్తిరెడ్డిగూడెం..

ప్రస్తుతం వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అధికారుల వేధింపులవల్లే వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మద్యంమత్తులోనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు సిద్ధపేట పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్.. గత కొంతకాలంగా కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు విధులకు హాజరుకావడంలేదని.. అతని భార్య వేడుకోవడంతో తిరిగి విధుల్లోకి తీసుకున్నామని.. ఇంతలోనే ఈ ఘటన జరిగిందన్నారు పోలీస్ కమిషనర్.