లోకేష్ చిరుతిండి ఖర్చు ఎంతో తెలుసా ?

SMTV Desk 2019-10-16 15:27:02  

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ జిల్లా పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలని ముగించుకుని చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చారు. అయితే ఈ సందర్భంగా టీడీపీ నేతలు చేసిన ఒక పని లోకేష్ మెడకు చుట్టుకుంది. ఎయిర్ పోర్టు నిబంధనల మేరకు వీఐపీ లాంజ్ లో స్టేట్ - సెంట్రల్ క్యాబినెట్ హోదా కలిగిన నేతలు వచ్చినప్పుడు కొద్దిసేపు అక్కడ విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పిస్తారు. ఆ సందర్భంలో టీ - స్నాక్స్ కు మాత్రమే అనుమతి ఇస్తారు. ఆ వీఐపీ ఏదైనా తినాలనుకుంటే వాటిని ప్రొటోకాల్ అధికారులే దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేస్తారు. అయితే వీఐపీలు మినహా వారి వ్యక్తిగత సహాయకులు సైతం పక్కన ఉన్న ప్రైవేట్ రెస్టారెంట్ కి వెళ్లాల్సిందే. కానీ ఆరోజున బాబు అల్పాహారం మాత్రమే తీసుకున్నప్పటికీ ఆయనకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన టీడీపీ నాయకులు - కార్యకర్తలు పక్కనే ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ నుంచి బిర్యానీలు తెచ్చుకుని విఐపి లాంజ్ లోనే తినేశారు.

ప్రోటోకాల్ అధికారులు వారిస్తున్నా వినకుండా అక్కడే బిర్యానీలు లాగించేశారు. పైగా వీళ్ళు వెళ్లిపోయాక రెస్టారెంట్ ఓనర్ వచ్చి అధికారులని బిల్లు అడిగారట. దీంతో అధికారులు వాళ్ళు తింటే తామెలా ఇస్తామని అడుగుతున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు - లోకేష్ లు ఎయిర్ పోర్ట్ కు వచ్చినప్పుడు ఖర్చు చేసిన బిల్లులే ఇంకా పెండింగ్ లో ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ఈ వివాదం బయటకు రావడంతో గతంలో లోకేష్ పెట్టిన ఖాతా బయట కొచ్చింది. లోకేష్ విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రతిసారి ఇలాగే జరిగిందని, పైగా చిన్న తిను బండరాలకు కూడా లక్షల్లో బిల్లులు వేశారని తెలుస్తోంది. 2017 నుంచి 2019 మార్చి వరకు చంద్రబాబు - లోకేష్ బాబుల విశాఖ ఎయిర్ పోర్ట్ లో తినుబండారాల ఖర్చు సుమారు రూ.12 లక్షల మేర బిల్లులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది.