పెట్టుబడులు పెట్టడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదు

SMTV Desk 2019-09-26 17:56:17  

న్యూ యార్క్ : భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని బహుళజాతి కంపెనీల సిఇఒలను ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానించారు. పెట్టుబడులకు రక్షణ కల్పిస్తామని, సురక్షితమైన వృద్ధి సాధించేందుకు దేశంలో అవకాశాలున్నాయని హామీ ఇచ్చారు. న్యూయార్క్‌లోని బ్లూమ్‌బెర్గ్‌ గ్లోబల్‌ ఫోరంలో బుధవారం నిర్వహించిన బహుళజాతి కంపెనీల సిఇఒల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందనీ, పెట్టుబడులకు భద్రత, సానుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో దేశంలో అధునాతన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై 1.3 ట్రిలియన్‌ డాలర్లు వెచ్చించనున్నామని, సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై లక్షల కోట్లు ఖర్చు చేస్తామని మోదీ చెప్పారు. దేశంలో వాణిజ్య వాతావరణాన్ని మెరుగుపరచేందుకు భారత్‌ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఆ దిశగా కార్పొరేట్‌ పన్ను తగ్గించాలనే నిర్ణయంతో భారత్‌ సానుకూల సంకేతాలిచ్చిందని ఆయన వివరించారు. మరే ఇతర దేశంలోనూ భారత్‌లో ఉన్నన్ని అవకాశాలు లేవని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ దేశంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్య రంగంలో తాము కల్పించిన బీమా ఉత్తర అమెరికా మొత్తం ప్రజల సంఖ్య కంటే ఎక్కువ మందికి అమలవుతోందని తెలిపారు. రక్షణ రంగంలోకీ పెట్టుబడులను మోడీ ఆహ్వానించారు. తమ దేశంలో ప్రతిభావంతమైన యువత కూడా ఎక్కువగా ఉందని మోడీ తెలిపారు. వ్యాపారాలను గౌరవించే ప్రభుత్వం తమ దేశంలో ఉందని, కార్పొరేట్‌ సంస్థలకు పన్నుల్లో కోత విధించడం ఒక విప్లవాత్మక చర్య అని మోదీ పేర్కొన్నారు.