మూతపడుతున్న అన్న క్యాంటీన్లు.. కారణం ?

SMTV Desk 2019-06-04 16:28:12  Anna Canteens,

పట్టణ, పల్లె, సిటీ తారతమ్యాలు లేకుండా లేని వాడికి 5 రూపాయలకే ఆహారం అందజేయాలనే ఉద్దేశంతో గత ఏపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. ముందుగా పట్టణ ప్రాంతాల్లో ప్రారంభించిన ఈ క్యాంటీన్లను సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్రంలోని మండల కేంద్రాల్లో కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికల ముందు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్లు ఇప్పుడు మూతపడుతున్నాయని సమాచారం. ఎందుకంటే ఆహరం అందిస్తున్న సంస్థకు రూ.45 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడంతో క్యాంటీన్లకు ఆహార సరఫరాను నిలిపివేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 204 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇందులో 184 క్యాంటీన్లను పట్టణ ప్రాంతాల్లో ప్రారంభించారు. అయితే, ఎమ్మెల్యేల నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో ఎన్నికలలో లబ్ది పొందవచ్చు అనే ఉద్దేశంతో మండల కేంద్రాల్లో కూడా ఈ క్యాంటీన్లను టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. భవనాలు అందుబాటులో లేకపోవడంతో తాత్కాలిక షెడ్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ కి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. వీటికి చెల్లింపులు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని నిర్వాహకులు మొన్న జగన్ ని కూడా కలిసి మొరపెట్టుకున్నారు. అయినా బకాయిలు చెల్లింపులకు చర్యలు తీసుకోకపోవడంతో తాత్కాలిక క్యాంటీన్లకు ఆహార సరఫరాను నిలిపివేస్తున్నారు. అయితే శాశ్వత క్యాంటీన్లకు మాత్రం ఎలాంటి ఇబ్బందీ లేదని అధికార వర్గాలు వెల్లడించాయి.