బిలియనీర్ కూతురినంటూ మోసం...ఓ 28 ఏళ్ల యువతి నిర్వాకం

SMTV Desk 2019-05-11 16:15:18  billionaire daughter, germany crime, german lady

ఓ బిలియనీర్ కుమార్తెనని చెప్పుకుంటూ 28 ఏళ్ల ఓ జర్మనీ యువతి పలు బ్యాంకులు, లగ్జరీ హోటళ్లు, రెస్టారెంట్లు, విమాన సంస్థలు సహా అనేకమంది మిత్రులను బురిడీ కొట్టించిన వైనమిది! తీరా ఆమె చెప్పినవన్నీ అబద్ధాలేనని కోర్టులో తేలడంతో నాలుగు నుంచి 12 ఏళ్ల పాటు జైలుశిక్ష పడింది.

సరోకిన్ అనే ఈ యువతికి విదేశాల్లో 67 మిలియన్ డాలర్ల సంపద ఉందని నమ్మిన పలు ఫైనాన్స్ సంస్థలు, మాన్హాటన్‌ సెలబ్రిటీలు నిలువునా మోసపోయారు. ఆమె విలాసవంతమైన విమాన ప్రయాణాలు, విలువైన దుస్తులు, లగ్జరీ హోటళ్ల కోసం సొమ్ములు సమకూర్చారు. తన తండ్రి ఓ దౌత్యవేత్త అనీ, ఇంధన వ్యాపారి అనీ చెప్పుకున్న సరోకిన్.. తన పలుకుబడి కొనసాగించేందుకు తప్పుడు గుర్తింపు కార్డులు, బ్యాంకు రికార్డులను సైతం సృష్టించింది.

అంతే కాదు.... ఓ ప్రయివేటు ఆర్ట్ క్లబ్ నిర్మిస్తానంటూ ఓ బ్యాంకులో 22 మిలియన్ డాలర్ల రుణం కోసం కూడా ప్రయత్నించింది. అందులో ఎగ్జిబిషన్లు, సంస్థలు, పాప్-అప్ షాపులు పెడతానని చెప్పినప్పటికీ సదరు బ్యాంకు నమ్మలేదు. అయితే ఎట్టకేలకు ఓ బ్యాంకు ఒప్పించి లక్ష డాలర్ల రుణం తీసుకున్న ఈ కిలాడీ.. వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమైంది. వివిధ రూపాల్లో మొత్తంగా సరోకిన్ 2.75 లక్షల డాలర్లు దండుకున్నట్టు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.

విచారణ సందర్భంగా ఆమె కోర్టులో మాట్లాడుతూ...‘‘ నేను తప్పు చేశాను.. నన్ను క్షమించండి..’’ అంటూ కంటతడి పెట్టింది. సరోకిన్ వీసా గడువు కూడా ఎప్పుడో ముగిసిపోవడంతో ఆమెను జర్మనీ తిప్పి పంపనున్నారు. మరోవైపు ఇప్పటిదాకా సంపన్న వారసురాలినంటూ తిరిగిన ఈ యువతి కటకటాల పాలయ్యిందన్న వార్త స్థానిక మీడియాలో సంచలనంగా మారింది. ఆమెపై ఓ టీవీ సీరియల్‌ తీసేందుకు కూడా రంగం సిద్ధమైంది!