300 కేజీల నుంచి 86 కేజీలకు తగ్గిన మహిళ.....ఏకంగా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం

SMTV Desk 2019-05-10 13:11:41  over weight, obesity, limca book of world records

300 కేజీల బరువు నుంచి 86 కేజీలకు తగ్గడం సాధ్యమేనా. ఏకంగా 214 కేజీల బరువును తగ్గించుకోవడమంటే ఆషామాషీ కాదు.. చాలా కష్టమైన పనే. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ముంబై డాక్టర్లు. అధిక బరువుతో బాధపడుతున్న ఓ మహిళకు పెద్ద భారాన్ని దించేశారు. ఏకంగా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు.

ముంబై వసాయ్ ప్రాంతానికి చెందిన రజనీ 300 కేజీల బరువు ఉండేది. ఈ ఓవర్ వెయిట్‌తో.. ఆసియాలోనే అధిక బరువు ఉన్న మహిళగా రికార్డుల్లోకి ఎక్కింది. పాపం రజనీ ప్రతి చిన్న పనికి కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సి వచ్చేది.. కనీసం అడుగులో అడుగు వేయలేకపోయేది. ఎటూ కదల్లేదని స్థితిలో కేవలం ఇంటికి పరిమితమయ్యేది.. తర్వాత బాగా డిప్రెషన్‌లోకి వెళ్లింది. రజనీని చూసి ఆమె మేనల్లుడు ఏడవడం మొదలు పెట్టేవాడట. దీంతో ఆమె మానిసికంగా కూడా చాలా కుంగిపోయింది.

రజనీకి తల్లిదండ్రులు ధైర్యం చెప్పారు.. ఆమెతోనే ఎక్కువ సమయం గడిపేవారు. దీనికి తోడు ఆమె అధిక బరువు దెబ్బకు కిడ్నీ, డయాబెటిస్ సమస్యలతో బాధపడింది.. ఊపిరి తీసుకోవడంలోనూ ఇబ్బందిపడింది. అప్పుడే రజని కుటుంబ సభ్యులకు డాక్టర్ శశాంక్ షా గురించి తెలియడంతో.. ఆయన్ను కలిసి తన సమస్యను చెప్పుకుంది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ షా బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించారు.. తర్వాత మరో సర్జరీ కూడా చేశారు. సర్జరీల తర్వాత కేలరీ తక్కువగా ఉన్న ఆహారాన్ని రజనీకి అందించారు.. అలాగే కొన్ని ఆహార పదార్థాలను తక్కువ మోతాదులో తీసుకోమని సలహా ఇచ్చారు.

రజనీ బేరియాట్రిక్ సర్జరీ గురించి డాక్టర్ షా చెప్పగానే భయపడింది. ఈ సర్జరీ చేయడం అంటే ఆషామాషీ కాదని.. ఎన్నో సమస్యలు ఉన్నాయని షా చెప్పారు. ఇన్‌ఫెక్షన్లు, రక్తం గడ్డకట్టడం కిడ్నీ ఫెయిలై అవకాశముంటుందన్నారు. దీంతో ఆమె సర్జరీలకు వెనకడుగు వేయగా.. డాక్టర్ షా రజనీకి ధైర్యం చెప్పారు. సర్జరీల తర్వాత 30 రోజుల పాటూ ఆమె ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించారు. రక్తం గడ్డ కట్టకుండా ఇంజెక్షన్లు ఇచ్చేవారు.. ఆమెతో వ్యాయామం కూడా చేయించేవారు.

సర్జరీల తర్వాత రజనీ 300 కేజీల నుంచి 86 కేజీలకు తగ్గింది. ఏకంగా 204 కేజీలు తగ్గి.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానాన్ని సంపాదించింది. బరువు తగ్గక ముందు ఇంటికి పరిమితమైన రజనీ.. ఇప్పుడు ఎంచక్కా విహార యాత్రలతో దేశమంతా చుట్టేస్తోంది.