హైదరాబాద్ ఓటమి...థంపి వల్లే!

SMTV Desk 2019-05-09 19:05:26  ipl 2019, srh vs dc, bussel thami

వైజాగ్: నిన్న వైజాగ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ చివరి బంతి వరకు పోరాడి 2 వికెట్ల వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, సన్‌రైజర్స్ ఓటమికి బసిల్ థంపి ఓవరే కారణమని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. అనంతరం 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 6 ఓవర్లలో 52 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో 7 వికెట్లున్నాయి.దీంతో విజయం ఢిల్లీదే అని అంతా భావించారు. ఈ పరిస్థితిలో సన్‌రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్ 15వ ఓవర్‌లో అద్భుతం చేసి మ్యాచ్‌ని సన్‌రైజర్స్‌వైపుకు తిప్పాడు. ఆ ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా రెండు వికెట్లు తీసి సన్‌రైజర్స్ అభిమానుల్లో ఆశలు రేపాడు. రషీద్ ఖాన్ తన ఓవర్‌లో కొలిన్ మన్రో (14), అక్షర్‌ పటేల్‌ (0)లను పెవిలియన్‌కు చేర్చాడు.రషీద్ ఓవర్ తర్వాత విజయం సన్‌రైజర్స్ వైపుకు తిరిగింది. అయితే, బసిల్‌ థంపి వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌ సన్‌రైజర్స్‌ అవకాశాల్ని దారుణంగా దెబ్బ తీసింది. ఈ ఓవర్లో రిషబ్ పంత్‌ వరుసగా 4, 6, 4, 6 బాదాడు. దీంతో ఈ ఓవర్‌లో పంత్ మొత్తం 22 పరుగులు రాబట్టడంతో ఢిల్లీ సమీకరణం 12 బంతుల్లో 12 పరుగులుగా మారిపోయింది.పంత్‌ క్రీజులోనే ఉండడం... అంతకముందు 18వ ఓవర్‌లో 22 పరుగులు రాబట్టడంతో విజయం ఢిల్లీదే అని అంతా భావించారు. అయితే, చివరి రెండు ఓవర్లు ఉత్కంఠభరితంగా సాగాయి. భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో తొలి బంతికి రూథర్డ్‌ఫర్డ్‌ (9) ఔట్‌ కాగా.. మూడో బంతికి పంత్‌ సిక్స్‌ కొట్టాడు. అదే ఓవర్ ఐదో బంతికి పంత్... నబీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.దీంతో ఆఖరి ఓవర్లో ఢిల్లీ విజయానికి ఐదు పరుగులు అవసరమయ్యాయి. ఢిల్లీ టాపార్డర్ మొత్తం కుప్పకూలడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. క్రీజులో కీమో పాల్‌, అమిత్ మిశ్రాలు ఉన్నారు. సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆఖరి ఓవర్‌ను ఖలీల్‌ అహ్మద్‌కు ఇచ్చాడు. దీంతో తొలి మూడు బంతుల్లో మూడు పరుగులు వచ్చాయి.ఢిల్లీ విజయ సమీకరణం మూడు బంతుల్లో రెండు పరుగులుగా మారింది. నాలుగో బంతి బ్యాటుకు తగలకపోయినా అమిత్ మిశ్రా పరుగు లంకించుకున్నాడు. అయితే, ఖలీల్‌ త్రోకు ఉద్దేశపూర్వకంగా అడ్డుగా వెళ్లినందుకు అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌ కింద అంఫైర్ అతడిని ఔట్‌గా ప్రకటించాడు. చివరి రెండు బంతుల్లో ఢిల్లీ రెండు పరుగులు చేయాల్సిన రావడంతో అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. ఐదో బంతిని కీమో పాల్ బౌండరీ బాదడంలో ఢిల్లీ విజయం సాధించింది.