దోస్త్‌ దరఖాస్తు తేదీ మరింత పొడగింపు ..

SMTV Desk 2019-05-08 16:05:12  dost, telangana

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలలో ప్రవేశం కొరకు ఈ నెల 10వ తేదీ నుంచి మొదలవవలసిన డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ’ (దోస్త్‌) 16వ తేదీకి వాయిదావేసినట్లు కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ప్రకటించారు. ఇంటర్మీడియట్‌ పరీక్షా పత్రాలను మళ్ళీ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేస్తున్నందున, దోస్త్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను 16కు వాయిదా వేశామని తెలిపారు. కనుక మే 15న దోస్త్ ప్రకటన వెలువడుతుందని, 16 నుంచి విద్యార్దులు ఆన్‌లైన్‌ ద్వారా దోస్త్‌కు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. జూలై 1వ తేదీ నుంచి డిగ్రీ తరగతులు మొదలవుతాయని తెలిపారు.

విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో విద్యాశాఖ అధికారులు, దోస్త్ కన్వీనర్, వివిద యూనివర్శిటీల వైస్ ఛాన్సిలర్లు పాల్గొన్నారు. ఆ సమావేశంలో విద్యార్దులకు ఉపయోగకరంగా ఉండే కొన్ని నిర్ణయాలు తీసుకొన్నారు.

దోస్త్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే విద్యార్దులు కావాలనుకొంటే ఆన్‌లైన్‌లోనే ఫీజు కూడా చెల్లించవచ్చు. ఇంజనీరింగ్ కాలేజీలలో ఏవిధంగా ఆన్‌లైన్‌ ద్వారా ప్రవేశాలు జరుగుతాయో అదేవిధంగా దోస్త్ ద్వారా వివిద కాలేజీలలో సీట్లు పొందిన విద్యార్దులు ఆన్‌లైన్‌లోనే ఆయా కాలేజీలలో చేరుతున్నట్లు తెలియజేయవచ్చు. టీ-వ్యాలెట్ ద్వారా కూడా కాలేజీ ఫీజులు చెల్లించే వెసులుబాటు కల్పించినందున విద్యార్దులపై సర్వీస్ ఛార్జీల భారం ఉండదు. అంతేకాదు ఒకవేళ విద్యార్దులు వేరే కాలేజీకి మారదలిచినా వారిపై యాజమాన్యం ఒత్తిడి ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా పాత 10 జిల్లా కేంద్రాలలో దోస్త్ ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి. కనుక డిగ్రీలో చేరే విద్యార్దులకు ఏవైనా అనుమానాలు కలిగినా, సమస్యలు ఎదురైన అక్కడికి వెళ్ళి పరిష్కరించుకోవచ్చు.