తెలంగాణ పరిషత్ ఎన్నికలు స్టార్ట్

SMTV Desk 2019-05-06 11:59:27  Telangana Parishath Elections,

మూడు దశలలో జరుగనున్న తెలంగాణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో మొదటిదశకు పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటల నుంచి మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈరోజు జరుగుతున్న తొలిదశ ఎన్నికలలో 2,097 ఎంపీటీసీల స్థానాలకు 7,072 మంది, 195 జెడ్పీటీసీలకు 882 మంది అభ్యర్దులు పోటీ పడుతున్నారు. వాటిలో 68 ఎంపీటీసీ, 2 జెడ్పీటీసీ స్థానాలకు ఏకగ్రీవం కావడంతో మిగిలిన స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగియనుంది.

నేడు జరుగుతున్న పోలింగులో ఓటర్లు వరుసగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్ధులిద్దరినీ ఎన్నుకోవలసి ఉన్నందున ఓటర్లలో గందరగోళం ఏర్పడకుండా ఉండేందుకుగాను ఎన్నికల సంఘం రెంటికీ వేర్వేరు రంగులలో ఉన్న బ్యాలెట్ పత్రాలను ముద్రించింది. గులాబీ రంగులో ఉండే ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాన్ని మొదట ఓటర్లకు ఇస్తారు. ఆ తరువాత తెలుపు రంగులో ఉండే జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాన్ని అందిస్తారు.

రాష్ట్రంలోని 32 జిల్లాలలో కలిపి మొత్తం 5,857 ఎంపీటీసీ, 539 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. వాటిలో ములుగు జిల్లాలోని మాగంపేట మండలంలో గల 20 ఎంపీటీసీ, 1 జెడ్పీటీసీ స్థానాలలో న్యాయవివాదం నెలకొన్న కారణంగా ఎన్నికలు జరుగడంలేదు. కనుక మిగిలిన 5,817 ఎంపీటీసీ, 538 జెడ్పీటీసీ స్థానాలకు 3 దశలలో ఎన్నికలు జరుగుతున్నాయి. మే 10, 14 తేదీలలో రెండు, మూడవ దశ ఎన్నికలు జరుగనున్నాయి. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతే వీటి ఫలితాలు ప్రకటించబడతాయి.