రుణ మాఫీ చేసాకే ఎన్నికల బరిలో దిగుతాం: టిడిపి

SMTV Desk 2019-02-08 13:32:09  TDP, Chandrababu, Agriculture Minister Somireddy chandra Mohan reddy

అమరావతి, ఫిబ్రవరి 08: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేశాకే ఎన్నికలకు వెళతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని ఆయన తెలిపారు. 10 శాతం వడ్డీ కలిపి నాలుగు, ఐదు విడతల్లో రూ.8,000 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉందని, ఈ మొత్తాన్నీ ఒకేసారి మాఫీ చేస్తామని ఆయన సభ్యులకు వివరించారు.

కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా సహకరించకపోయినా రైతులకు రూ.24 వేల కోట్లు అందజేశామని ఆయన అన్నారు. 23.76 లక్షల కుటుంబాలకు రూ.50,000లోపు రుణమాఫీ చేశామన్నారు. అంతేకాకుండా 2.39 లక్షల మంది కౌలు రైతులకు సైతం రుణాలను మాఫీ చేశామని, బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని అన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వం పై అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

ఆధార్, రేషన్ కార్డుల అప్ లోడ్ లో నిర్లక్ష్యం వహించడం వల్ల ఆరు జిల్లాల్లో 19,445 మందికి రుణమాఫీ జరగలేదని అన్నారు. వీరందరికీ గ్రీవెన్స్ డే సందర్భంగా రూ.52.45 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని అయినా కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వం పై అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.