ఢిల్లీకి పయనమైన కేసీఆర్

SMTV Desk 2019-01-22 20:51:22  Telangana state chief minister KCR, KCR Going Delhi, TRS, Central minister son mayank, Mayank marriage

హైదరాబాద్, జనవరి 22: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫార్మ్ హౌస్ నిన్నటి నుండి జరుగుతున్న మహా చండీ యాగంలో పాల్గొని మంగళవారం ఆయన హైదరాబాద్ కు చేరుకొని ఢిల్లీ కి పయనమయ్యారు. ఈరోజు రాత్రి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి హర్షవర్ధన్‌ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొంటారని పార్టీ నేతల సమాచారం.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది. అనంతరం రాత్రికి ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. బుధవారం ఉదయం జరిగే యాగంలో కేసీఆర్‌ పాల్గొంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో యాగం చేసే కేసీఆర్ వొక్క వివాహం కోసం హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్ళడం విశేషమే. గతంలో ఆయన రెండు పర్యాయాలు యాగాలు చేశారు. రెండు సందర్భాలలోనూ యాగం పూర్తి అయ్యే వరకు ఫార్మ్ హౌస్ కే పరిమితం అయ్యారు.

ఈ క్రమంలో అంత అర్జెంటుగా ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్ళి ఉంటారని సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. మరోవైపు జాతీయ రాజకీయాలలో తాను శాసించాలని కాలం కలిసొచ్చి ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటూ కేసీఆర్ ఈ యాగం చేస్తున్నట్టు జాతీయ మీడియా ఛానళ్ళు కార్యక్రమాలు ప్రసారం చెయ్యడం గమనార్హం. అయితే ఇటువంటి వ్యాఖ్యలను అర్థరహితమని కేసీఆర్ కుమారుడు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొట్టి పారేశారు. తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు సాగాలని.. రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలని, ప్రజలు క్షేమంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని కాంక్షిస్తూ యాగం చేస్తున్నారని, అలాగే రాష్ట్రంతోపాటు దేశం సుభిక్షంగా ఉండాలని, దేశ పౌరులకు సుపరిపాలన అందాలని భగవంతుణ్ని ప్రార్థించారని పార్టీ వర్గాలు తెలిపాయి.