ఈబీసీ బిల్లుపై తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకి హైకోర్టు నోటీసులు..

SMTV Desk 2019-01-22 18:05:33  ebc 10 percent reservations, Telangana High Court, reservations, upper caste poor, jajula srinivas goud, DMK, BJP

హైదరాబాద్‌, జనవరి 22: కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉపాధి రంగాలలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ఇటీవల పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లును సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్ట్ లో పిటీషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఈరోజు (మంగళవారం) విచారణ చేపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

10 శాతం రిజర్వేషన్లపై బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ సోమవారం పిటీషన్ దాఖలు చేశారు. దీనిలో రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి, కేంద్ర సామాజిక న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్‌ చట్ట సవరణ వల్ల రాజ్యాంగ మౌలిక స్వరూపం మారిపోతుందని పిటిషనర్‌ తెలిపారు. దీని వల్ల ఓపెన్‌ కాంపిటీషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఆర్థిక వెనుకబాటుతనం ప్రస్తావన లేదని తెలిపారు. రిజర్వేషన్‌ అనేది పేదరిక నిర్మూనలకు ఉద్దేశించిన కార్యక్రమం కాదని సామాజికంగా వెనుబడి, ఎన్నో శతాబ్దాలుగా విద్యాఉద్యోగాలకు దూరంగా ఉన్న కులాల కోసం రిజర్వేషన్లు పెట్టారని వివరించారు.

ఇక ఈడబ్ల్యూఎస్‌ చట్టాన్ని సవాల్‌ చేస్తూ మద్రాస్‌ హైకోర్టులో డీఎంకే పార్టీ పిటిషన్‌ దాఖలు చేయగా, న్యాయస్థానం ఫిబ్రవరి 18లోగా దానిపై వివరణ ఇవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.