కేసీఆర్ 'ఉద్యమసింహం'కు అడ్డంకులు

SMTV Desk 2019-01-21 13:32:22  

హైదరాబాద్, జనవరి 21: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఉద్యమసింహం . ఈ సినిమాకు అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్లను కట్ చేయాలని, ముఖ్యంగా కాంగ్రెసు నేతలకు సంబంధించిన దృశ్యాలను తొలగించాలని సెన్సార్ బోర్డు అధికారులు సూచిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ నాయకత్వంలో నడిచిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని చిత్రీకరిస్తూనే కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఉదంతం కూడా సినిమాలో ఉన్నట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ కోసం సినిమాను 15 రోజుల క్రితం పంపించారు. ఫొటోగ్రాఫ్స్ కు సంబంధించిన దృశ్యాలను తొలగించాలని సెన్సార్ బోర్డు సూచించినట్లు తెలుస్తోంది.

సినిమాలో సోనియా, రాజీవ్ గాంధీ ఫొటోలను కూడా వాడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కాంగ్రెసు కండువాను వాడారు. దీన్ని తొలగించాల్సిందిగా సెన్సార్ బోర్డు అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. నిజానికి, సినిమాను అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిరుడు నవంబర్ లోనే విడుదల చేయాలని భావించారు. కానీ సినిమా నిర్మాణం పూర్తి కాకపోవడంతో విడుదలతో జాప్యం జరిగింది. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఫొటోలు వాడవద్దని సెన్సార్ బోర్డు చేసిన సూచనను దర్శకుడు అంగీకరించినట్లు ఓ జాతీయ మీడియాలో వార్తాకథనం వచ్చింది. ఈ సినిమాలో కేసీఆర్ పాత్రను నటరాజన్ పోషిస్తున్నారు.