గాంధీ ముందు గాడ్సే...ఎన్టీఆర్ ముందు చంద్రబాబు

SMTV Desk 2019-01-19 19:37:18  Sajjala ramakrishnareddy sensational comments on ap cm, Chandrababu, NTR, Mahatma gandhi, Gadse

అమరావతి, జనవరి 19: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై గతంలో ఎగతాళి చేసిన చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్నవేళ మరో వేషానికి సిద్దమవుతున్నారంటూ విమర్శించారు. దివంగత నేత ఎన్టీఆర్‌ విగ్రహం ముందు చంద్రబాబు ఫోటో చూస్తే గాంధీ ముందు గాడ్సే నిలబడ్డట్లుగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సజ్జల చంద్రబాబు విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. హరికృష్ణ పార్థీవ దేహం వద్ద చంద్రబాబు టీఆర్‌ఎస్‌తో రాజకీయాలు మాట్లాడారని అది తప్పు కాదు కానీ కేటీఆర్ తమ అధినేత ఇంటికి వస్తే తప్పా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబులా శవరాజకీయాలు చెయ్యలేదని అందరికీ తెలిసేలా కేటీఆర్‌ వైఎస్ ఇంటికి వచ్చి ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి చర్చించారన్నారు.





టీఆర్‌ఎస్‌ పార్టీ ఏపీలో పోటీ చేసే అవకాశం లేదని అలాంటిది ఆ పార్టీని బూచిగా చూపించి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారంటూ మండిపడ్డారు.రాష్ట్రంలో లేని ప్రత్యర్థులను సృష్టించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ప్రజలపై మమకారం లేదని కేవలం ద్వేషం మాత్రమే ఉందన్నారు. హామీ లేకుండా ఆ రోజు దివంగత నేత వైఎస్సార్‌ ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు ఓట్ల పండుగకు ముందు వృద్దులకు పింఛన్లు పెంచుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులు కడుతుంటే మా పార్టీ నిరసన తెలిపిందని అలాగే ప్రశ్నించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. 2014లో బీజేపీ ఆహ్వానం ఉన్నా తమ పార్టీ వెళ్లలేదన్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తోను జతకట్టలేదన్నారు. ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ బలంగా ఉందన్నారు. పార్టీలను కొనే స్థాయికి చంద్రబాబు వెళ్లినట్లు తెలుస్తోందన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏపీ కేంద్రబిందువుగా, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా వైసీపీ పోరాడుతుందని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు.