నల్గొండలో కోమటిరెడ్డి సోదరులదే పై చేయి

SMTV Desk 2018-11-13 12:49:07  Cheruku sudhakar, cheruku laxmi, Chirumarthi Lingaiah, Komatireddy Rajagopal reddy, Congress party

నకిరేకల్, నవంబర్ 13: ఎన్నికల సమయం దగ్గరికోస్తున్నా మహాకూటమిలోని సీట్ల పంచాయితీ ఇంకా కొనసాగుతూనే వుంది. అయితే రెండు రోజుల క్రితం హటాత్తుగా తెరపైకి వచ్చిన తెలంగాణ ఇంటి పార్టీకి నకిరేకల్ సీటు కేటాయించబోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కూడా మహాకూటమి చర్చలలో పాల్గొంటుండటంతో మీడియాలో వస్తున్న వార్తలకు బలం చేకూరింది. పైగా సుధాకర్ స్వయంగా కాంగ్రెస్ పార్టీ తమకు నకిరేకల్ సీటు కేటాయించిందని, అక్కడి నుంచి తన భార్య చెరుకు లక్ష్మి పోటీ చేయబోతోందని ప్రకటించడంతో కోమటిరెడ్డి సోదరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమ అనుచరుడు చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్‌ సీటు కేటాయించకపోతే తామిద్దరం ఎన్నికలలో పోటీ చేయబోమని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. దాంతో కాంగ్రెస్‌ అధిష్టానం కూడా దిగివచ్చి వారు కోరినట్లుగానే చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్‌ సీటును కేటాయించింది. అలాగే ఇదివరకు ఎంపీగా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను ఈసారి మునుగోడు నుంచి శాసనసభకు పోటీ చేయాలనుకొంటున్నట్లు కాంగ్రెస్‌ అధిష్టానానికి చెప్పగా, ఆ ప్రతిపాదనకు కాంగ్రెస్‌ అధిష్టానం అంగీకరించి ఆయనకు మునుగోడు టికెట్ ఖరారు చేసింది. కనుక కోమటిరెడ్డి సోదరులు ఇక నల్గొండలో కాంగ్రెస్ పార్టీ విజయానికి గట్టిగా కృషి చేయవచ్చు.