మహాకూటమి : కాంగ్రెస్ vs సిపిఐ

SMTV Desk 2018-11-10 13:10:33  CPI, Congress, Mahakootami, Telangana Elections

హైదరాబాద్, నవంబర్ 10: సిపిఐ నేతలు కాంగ్రెస్‌ పై మండిపడుతున్నారు. మహాకూటమిలో సిపిఐ పార్టీకి 3 అసెంబ్లీ సీట్లు కేటాయించినట్లు కాంగ్రెస్‌ అధిష్టానం డిల్లీ నుంచి ప్రకటించిన అనంతరం సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరమణ, పార్టీ రాష్ట్ర నేత గోద శ్రీరాములు జాతీయ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిన్న సాయంత్రం సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కాంగ్రెస్ ప్రకటనపై వాడివేడిగా చర్చ జరిగింది. వొక రాజకీయ లక్ష్యం కోసం ఏర్పడిన మహాకూటమిని కాంగ్రెస్ పార్టీ తన అంతర్గత సమస్యలు, వొత్తిళ్ళ కారణంగా నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తోందని వారు అభిప్రాయపడ్డారు.

వొకవేళ కాంగ్రెస్‌ పార్టీ తాము కోరుకొన్నట్లు సీట్లు ఇవ్వకుంటే, కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, మునుగోడు, బెల్లంపల్లి స్థానాల్లో పోటీ చేయాలని సిపిఐ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు వారు మీడియాకు వొక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇవాళ్ళ సాయంత్రంలోగా కాంగ్రెస్ పార్టీ సీట్ల పంపకాలు పూర్తిచేయనట్లయితే, రేపు మళ్ళీ మరోమారు సమావేశమయ్యి తమ కార్యాచరణ ప్రకటించాలని సిపిఐ నేతలు నిర్ణయించుకొన్నారు.

కాంగ్రెస్ పార్టీకి వొక పక్క పార్టీలో అంతర్గతంగా నేతల నుంచి టికెట్లు, నియోజకవర్గాల కోసం తీవ్ర వొత్తిడిని ఎదుర్కొంటోంది. ఆ కారణంగా మహాకూటమిలో మిత్రపక్షాలు కోరినట్లు సీట్ల కేటాయించలేకపోవడంతో వారి నుంచి కూడా ఈవిధంగా తీవ్రవొత్తిడిని ఎదుర్కొంటోంది. అయితే సీట్లు, నియోజకవర్గాల పంపకాలపై ఇప్పటికే చాలా జాప్యం జరిగింది కనుక ఇటు పార్టీలోను, అటు మహాకూటమిలోను ఆశావాహులలో అసహనం పెరిగిపోతోంది. కనుక నేడో రేపో కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేసి ఈ తంతు ముగించక తప్పదు.