అమెరికాలో నైట్ క్లబ్ లో కాల్పులు

SMTV Desk 2018-11-09 17:47:26  California, Los Angeles, Thousands Ok, Boarder Line Bar and Grill, Gun firing, Night clubs, Iyan Devid Lang

లాస్ ఏంజిలిస్, నవంబర్ 09: కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజిలిస్ నగర శివార్లలో ‘థౌజెండ్‌ ఓక్స్‌ అనే ప్రాంతంలో గల ‘బోర్డర్‌లైన్‌ బార్‌ అండ్‌ గ్రిల్‌ అనే నైట్ క్లబ్బులో గురువారం రాత్రి 12.50 గంటలకు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో వొక పోలీస్ ఆఫీసరుతో సహా 12మంది యువతీ యువకులు చనిపోయారు. మరో 21 మంది గాయపడ్డారు.

నైట్ క్లబ్బులో యువతీయువకులు హుషారుగా డ్యాన్సులు చేస్తున్నప్పుడు లోపలకు ప్రవేశించిన ఇయాన్‌ డేవిడ్‌ లాంగ్‌ ముందుగా వారిపై పొగ బాంబులు విసిరాడు. వెంటనే చేతిలో తుపాకీతో వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరుపడంతో, 21 మంది పిట్టల్లా రాలిపోయారు. అంతవరకు ఆనందోత్సాహాలతో కళకళలాడిన ఆ నైట్ క్లబ్బులో వొక్కసారిగా కేకలు, ఆర్తనాధాలతో దద్దరిల్లిపోయింది. అందరూ ప్రాణాలు కాపాడుకొనేందుకు భయంతో తలోదిక్కు పరుగులు తీశారు.

ఆ ప్రాంతంలోనే విధులు నిర్వహిస్తున్న వెంటూరా కౌంటీ షెరీఫ్‌ శాఖకు చెందిన సార్జంట్‌ రాన్‌ హెలస్‌ కాల్పుల శబ్ధం విని నైట్ క్లబ్బులోకి ప్రవేశించగా, డేవిడ్‌ అతనిపై కూడా విచక్షణా రహితంగా కాల్పులు జరుపడంతో అతను కూడా ఘటన స్థలంలోనే చనిపోయాడు. ఈ సమాచారం అందుకొని స్థానిక పోలీసులు నైట్ క్లబ్బును చుట్టూ ముట్టడంతో డేవిడ్‌ తుపాకీతో తనను తాను కాల్చుకొని చనిపోయాడు.

డేవిడ్ గతంలో అమెరికా నావికా దళంలో మేరీన్ కోర్ బృందంలో పనిచేసేవాడు. కానీ అతని మానసిక పరిస్థితి సరిగా లేనందున నావికాదళం నుంచి బయటకు పంపించివేసినట్లు సమాచారం. అతను బయటకు వచ్చేసిన తరువాత చిన్న చిన్న నేరాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.