దీపావళి వీడియో

SMTV Desk 2018-11-05 19:06:31  Diwali, hp Company, Umeed Ka Diya

దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం వొక వీడియోను విడుదల చేసే హెచ్.పి కంపెనీ ఈ సంవత్సరం కూడా “ఉమీద్ కా దియా” అనే పేరుతొ వొక వీడియోను తన అఫీషియల్ ఫేస్‌బుక్ అకౌంట్‌లో విడుదల చేసింది. దీపాలను వెలిగించే ప్రమిదలను పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్‌లలో కాకుండా రోడ్డు పక్కన అమ్మే వాళ్ళ దగ్గర కొనాలని ఈ వీడియో సారాంశం.



‘మనం వేసే వొక్క అడుగు ఎందరో జీవితాల్లో మార్పును తెస్తుంది. పండుగకు కావాల్సిన వస్తువులను వీధుల్లో అమ్మేవారి నుంచి కొనండి... వాటితో మన ఇంట్లో వెలిగించే దీపాలు వారి నివాసాల్లోనూ వెలుగునిస్తాయి’ అని హెచ్‌.పీ ఇండియా కోరింది.

వీడియోలో ఓ బాలుడు తన తల్లితో కలిసి దీపావళి షాపింగ్‌ చేయడానికి మాల్‌కు వెళతాడు. అక్కడ ఖరీదైన వస్తువులు కొంటారు. మాల్‌ నుంచి బయటికి వస్తుండగా ఆ బాలుడికి రోడ్డు పక్కన ప్రమిదలను అమ్ముతున్న ఓ వృద్ధ మహిళ కనబడుతుంది. ఆమె ఫొటో తీస్తాడు. ‘అమ్మా ఇవి కొనుక్కుందాం..’ అని తన తల్లిని అడుగుతాడు. కానీ అందుకు ఆమె వొప్పుకోదు. పైగా ఆ మహిళను అసహ్యంగా చూస్తుంది. అప్పుడు ఆ మహిళకు బాలుడు ఏ విధంగా సాయం చేశాడు? అన్న విషయాన్ని ఈ వీడియోలో చూపించారు. మూడు రోజుల్లో ఈ వీడియోను ఇరవై లక్షల మంది వీక్షించారు.